హిందూ దేవాలయాల కోసం.. ముస్లిం కౌన్సిలర్
By అంజి Published on 9 Feb 2020 9:32 AM GMTమెదక్: హిందూ-ముస్లింల మధ్య గొడవలు పెడదామా.. పబ్బం గడుపుదామా అని అనుకునే నాయకులు ఎంతోమంది. ఇరు మతాల ప్రజలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నాయి పార్టీలు..! మెదక్ మున్సిపాలిటీ లోని 11వ వార్డు కౌన్సిలర్ అయిన ఎండీ.సంయుద్దీన్ మాత్రం రెండు దేవాలయాలను కట్టించడమే తన భుజాల మీద ఉన్న అతి గొప్ప బాధ్యత అని చెబుతున్నారు.
శుక్రవారం నాడు మెదక్ మున్సిపాలిటీలో మొదటి జనరల్ బాడీ మీటింగ్ జరుగగా ఎం.డీ.సంయుద్దీన్ మాత్రం తన వార్డులో దేవాలయాలు కట్టించాలని చెప్పుకొచ్చారు. అదే మొదటి పని కూడా అవ్వాలని.. ఈ పనిని పూర్తీ చేయాల్సిన బాధ్యత తనపై ఉందని సంయుద్దీన్ అన్నారు. మొదటి జనరల్ బాడీ మీటింగ్ కు తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ టి.హరీష్ రావు కూడా హాజరయ్యారు. సంయుద్దీన్ తీసుకొచ్చిన డిమాండ్ పై ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఇతర మతాలకు చెందిన ప్రజలకు కూడా అండగా నిలబడడం నీ మంచితనం అని అభినందించారు.
సంయుద్దీన్ ఇప్పటికే పలు మంచి పనులు చేశారని.. మెదక్ లో మంచి పేరు ఉంది. ఆయన ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందారు. తమ వార్డులో ముస్లింలకు నమాజ్ చేసుకోడానికి పెద్ద మసీదు ఉందని.. అదే హిందూ సోదరసోదరీమణుల కోసం మాత్రం ఎటువంటి దేవాలయాలు లేకపోవడం చాలా బాధపెట్టిందని.. అందుకే తాను వార్డులో రెండు దేవాలయాలు కట్టించాలని భావిస్తున్నానని సంయుద్దీన్ మీడియాకు తెలిపారు. సంయుద్దీన్ నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.