రాకాసి కరోనా: 13,003 మృతులు.. 3,04,999 కేసులు

By అంజి  Published on  22 March 2020 1:01 AM GMT
రాకాసి కరోనా: 13,003 మృతులు.. 3,04,999 కేసులు

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. చైనాలో ఈ వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గు ముఖం పట్టిన పట్టిన మిగిలిన అన్ని దేశాల్లో దాని తీవ్రత పెరిగింది. ఇక ఇటలీ దేశంలోనైతే కరోనా మృత్యుకేళి కొనసాగుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ 188 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 3,04,999 మందికి కరోనా సోకగా.. వీరిలో 94,793 మంది బాధితులు కోలుకున్నారు. ఇక మృతుల సంఖ్య 13 వేలు దాటేసింది. దాదాపుగా ఒక పదివేల మందికి వైరస్‌ ప్రభావం ఉందని తెలిసింది. అయితే వీరందరిని కాపాడడం కోసం వైద్యులు అహర్నిశలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: జనతా కర్ఫ్యూను ఇలా పాటించండి.!

ఇటలీలో శనివారం ఒక్క రోజే 793 మంది చనిపోయారు. ఆ దేశంలో ఇప్పుడు మృతుల సంఖ్య 4,825కి చేరింది. మరో 53,578 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఇక వైరస్‌ పుట్టిన చైనా దేశంలో మాత్రం శనివారం నాడు ఒక్క మరణం కూడా సంభవించలేదు. చైనాలో ప్రస్తుతానికి 81,008 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. చైనా దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,255గా ఉంది. స్పెయిన్‌లో కరోనా మృతుల సంఖ్య 1378కి చేరింది. ఇటలీ తర్వాత స్పెయిన్‌ దేశంలోనే అధికంగా మరణాలు నమోదు అవుతున్నాయి. ఇక శనివారం ఒక్క రోజే స్పెయిన్‌లో 258 మంది చనిపోయారు. అమెరికాలో సైతం కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. శనివారం ఒక్క రోజే అమెరికాలో 46 మంది మృత్యువాత పడ్డారు. జర్మనీ, ఇరాన్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌లో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది.

Also Read: ఏపీలో మరో రెండు కరోనా కేసులు.. మహారాష్ట్రలో ప్రమాద ఘంటికలు..

భారత్‌లోనూ కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 327కి చేరింది. అయితే వీరిలో 300 మందికి ఆస్పత్రుల్లో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మన దేశంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. అత్యధిక కరనా కేసులు మహారాష్ట్రలో నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 63 మంది కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే ఓ ప్రకటనలో తెలిపారు. కేరళలో 52, ఢిల్లీలో 26, ఉత్తరప్రదేశ్‌లో 26, రాజస్థాన్‌లో 23, తెలంగాణలో 21, కర్నాటకలో 19 మంది కరోనా కేసులు ఉన్నాయి.

Next Story