ఉస్మానియాలో 'కరోనా'.. గాంధీలో పెయింగ్ 'కరోనా' వార్డులు
By అంజి Published on 11 Feb 2020 5:14 AM GMTహైదరాబాద్‌లో కరోనా అనుమానిత కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో మరో కరోనా అనుమానిత కేసు నమోదైంది. సూర్యాపేటకు చెందిన ఓ విద్యార్థి ఇటీవలే చైనా నుంచి తిరిగి వచ్చాడు. అతనికి జలుబు, దగ్గు, అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఫీవర్ ఆస్పత్రికి తరలించారు ఇప్పటికే గాంధీ ఆస్పత్రి, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు.
తాజాగా రాష్ట్రంలో హెల్త్ అలర్ట్ నేపథ్యంలో ఉస్మానియా ఆస్పత్రిలో కూడా ఐసోలేటెడ్ వార్డును ఏర్పాటు చేశారు. గతంలో ఉస్మానియాలో స్వైన్‌ఫ్లూ వార్డు ఉండేది. దానినే ముందస్తు చర్యల్లో భాగంగా కరోనా వార్డుగా మార్చామని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. కరోనా అనుమానితులకు ప్రత్యేక చికిత్స ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రత్యేక వైద్యబృందంతో కమిటీని ఏర్పాటు చేసినట్టు నాగేందర్ తెలిపారు. కమిటీలో సీఏఎస్ ఆర్‌ఎంవో డాక్టర్ రాజ్‌కుమార్, జనరల్ మెడిసన్ అసోసియేట్ ఫ్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్, జనరల్ మెడిసన్ ఇంచార్జి డాక్టర్ బీ శ్రీనివాస్, ఎస్పీఎం విభాగాధిపతి ప్రొఫెసర్ కిరణ్మయి, మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జ్యోతిలక్ష్మీలు ఉన్నారు.
కరోనా వైరస్ ఇప్పటికే 26 దేశాలకు పాకింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, కేవలం అనుమానిత కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు 75 మందిని కరోనా వైరస్ అనుమానితులుగా గుర్తించగా.. వారిలో 73 మందికి వ్యాధి లక్షణాలు లేవని తెలిందని సమాచారం. మరో ఇద్దరికి సంబంధించిన వ్యాధి లక్షణాలు నిర్ధారణ పరీక్షల్లో తేలాల్సి ఉంది.
ఇక గాంధీ ఆస్పత్రిలో వీఐపీల కోసం ప్రత్యేక పెయింగ్ ఐసోలేటెడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలోని ఏడవ అంతస్తులో ఏడు పడకలతో కరోనా వీఐపీ వార్డును అందుబాటులోకి తెచ్చినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీ శ్రావణ్‌కుమార్ తెలిపారు. వ్యాధి నిర్ధారణ కోసం వచ్చే వీఐపీలు, వారి కుటుంబ సభ్యులు.. సాధారణ ఐసోలేషన్ వార్డుల్లో ఉండటానికి ఇష్టడడం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొందరు వీఐపీలు తమ హోదాకు తగ్గట్టుగా వసతులు ఏర్పాటు చేయాలని కోరడంతోనే ప్రత్యేక వీఐపీ వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీఐపీ కరోనా వార్డుల్లో టీవీ, ఏసీ, ప్రత్యేక బాత్‌రూం, తదితర సౌకర్యాలు కల్పించారు. వీఐపీల సంఖ్య పెరిగితే పడకల సంఖ్యను కూడా పెంచుతామన్నారు.