అమెరికా, రష్యాలను కూడా.. 'వెంటాడుతున్న కరోనా వైరస్'..!

By అంజి  Published on  3 March 2020 6:11 AM GMT
అమెరికా, రష్యాలను కూడా.. వెంటాడుతున్న కరోనా వైరస్..!

చైనాకు మాత్రమే కరోనా వైరస్ పరిమితం అని అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు ఒక్క అంటార్కిటికా ఖండం మినహా.. మిగిలిన అన్ని ఖండాలలోనూ ఈ మహమ్మారి ప్రబలుతోంది. చైనాలో కరోనా వైరస్ ప్రభావం రాను రానూ తగ్గుతూ ఉండడంతో.. మిగిలిన దేశాలలో పెరుగుతూ ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను కూడా కరోనా వైరస్ కబళించి వేస్తోంది.

ఆ దేశంలో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య రెండుకు చేరింది. చనిపోయిన ఇద్దరికీ కోవిద్-19 పాజిటివ్ గా తేలిందని.. వీరిద్దరూ వాషింగ్టన్ రాష్ట్రంలోని కింగ్ కౌంటీకి చెందిన వారు. అమెరికాలో ఇప్పటి వరకూ మొత్తం 74 కోవిద్-19 కేసులు నమోదయ్యాయి. మొదట 50 సంవత్సరాల వ్యక్తి దీర్ఘకాలిక అంతర్లీన వ్యాధులతో బాధపడుతుండగా.. అతడికి కోవిద్-19 సోకడంతో ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన రెండో వ్యక్తిని 70 సంవత్సరాల వ్యక్తిగా గుర్తించారు. 60 సంవత్సరాల వయసులో ఉన్న ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్ గా ఉందని తెలుస్తోంది.

కోవిద్-19 ఇప్పటివరకూ 88000 మందికి పైగా సోకింది.. దాదాపు 60 దేశాల్లో ఈ వైరస్ ప్రబలుతోంది. ఇప్పటివరకూ తమ దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించలేదని చెప్పుకున్న ఇండోనేషియాలో కూడా మొదటి కోవిద్-19 పాజిటివ్ కేసు నమోదైందని సోమవారం నాడు ప్రకటించింది. చైనాలో ఇప్పటివరకూ 2,912 కేసులు నమోదయ్యాయి.. రోజు రోజుకూ చైనాలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. చైనా తర్వాత అత్యధికంగా ఇరాన్ లో కరోనా వైరస్ కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి.

1501 కేసులు ఇరాన్ లో నమోదవ్వగా.. 66 మంది చనిపోయారు. ఆస్ట్రేలియాలో కూడా కోవిద్-19 కారణంగా మొదటి మరణం సంభవించిందని గత వారం తెలిపింది. యూరప్ లోని ఇటలీలో కూడా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. 1700కు పైగా కోవిద్-19 కేసులు ఇటలీలో నమోదయ్యాయి. ఉత్తర ఇటలీ లోని లాంబర్దీ రీజన్ లో వైరస్ విపరీతంగా ప్రబలుతోంది. అక్కడి కౌన్సిలర్ కు కూడా కోవిద్-19 పాజిటివ్ గా తేలింది. పోర్చుగల్, ఐస్ ల్యాండ్, అండొర్రా దేశాలు కూడా కోవిద్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రకటించాయి. జర్మనీలో కోవిద్-19 కేసులు 150 కు పెరిగాయి.

సౌత్ కొరియాను కూడా కరోనా వైరస్ కబళించి వేస్తోంది. చైనా తర్వాత అత్యధికంగా కేసులు నమోదైన దేశం సౌత్ కొరియానే..! ఇప్పటి వరకూ 4335 కేసులు నమోదయ్యాయి.. ఇప్పటి వరకూ 26 మంది చనిపోయారు. సౌత్ కొరియాలో ఇన్ఫెక్షన్లు 2,60,000కు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డేగు నగరంలో షిన్చెయోన్జీ చర్చ్ ఆఫ్ జీసస్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. అక్కడి నుండే సౌత్ కొరియాలో వైరస్ విపరీతంగా ప్రబలినట్లు తెలుస్తోంది.

మాస్కో..

రష్యాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవలే ఇటలీకి వెళ్లి వచ్చాడు. అతడికి కరోనా వైరస్ సోకిందని అక్కడి వార్తా సంస్థలు తెలిపాయి. అతడిని ఐసోలేషన్ వార్డులో చేర్చారు. జపాన్ క్రూయిజ్ నౌక లో ప్రయాణించిన ముగ్గురు రష్యన్ ప్రజలు కూడా కరోనా వైరస్ కు చికిత్స తీసుకుంటున్నారు.

Next Story