వైరస్ వ్యాపించేస్తోంది.. కుచ్ 'కరోనా'..

By అంజి  Published on  23 Jan 2020 4:20 PM GMT
వైరస్ వ్యాపించేస్తోంది.. కుచ్ కరోనా..

చైనాలో పుట్టుకొచ్చిన ప్రమాదకర కరోనా వైరస్ ఫ్లూ వంటి జ్వరాన్ని దేశ దేశాలకు ఎగుమతి చేస్తోంది. జనవరి 22 నాటికి దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా 17 మంది చనిపోయారు. మరో 470 మంది వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యాధి ప్రపంచమంతటా విస్తరించి, సార్స్ వ్యాధి లా గడగడలాడిస్తోంది. చైనాలోని వుహాన్ నుంచి ఇప్పుడు ఈ వ్యాధి అమెరికా దాకా విస్తరించింది. తాజాగా చైనాలోని హుబెయి రాష్ట్రంలో ఒక వ్యక్తి ఈ వ్యాధితో చనిపోయాడు. దీంతో ఒక్క వుహాన్ లోనే ఇప్పటికి తొ్మ్మిది మంది చనిపోయారు. ఇప్పటికే అనుమానం మీద రెండున్నర వేల మందిని వేరు చేసి, చికిత్స చేస్తున్నారు.

సార్స్ వ్యాధి సోకిన సమయంలో చైనా మొదట్లో దీనిని దాచిపెట్టేందుకు ప్రయత్నించింది. కానీ ఈ సారి ఒకటి రెండు రోజులు కాస్త దోబూచులాడిన తరువాత చైనా ప్రపంచానికి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే వస్తోంది. రవాణా సాధనాలు పెరిగిపోవడం, పండుగల సందర్భంగా ప్రజల రాకపోకలు, ప్రవపంచవ్యాప్త టూరిస్టుల కదలికల వల్ల ఈ వ్యాధి శరవేగంగా విస్తరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిని అత్యవసర పరిస్థితిగా ప్రకటించి, సమావేశాలను ప్రారంభించింది.ఇప్పటికే థాయ్ లాండ్, హాంకాంగ్, షాంఘై, మకావ్, తైవాన్, కొరియా, బీజింగ్ లలో వ్యాధి విస్తరించింది.

ఇక చైనాలోనైతే టూర్లు క్యాన్సిలవుతున్నాయి. ముఖాలకు ప్రజలు మాస్కులు పెట్టుకుంటున్నారు. సినిమాలు, షాపింగ్ సెంటర్ల వంటి జన సమ్మర్దం ఉన్న చోట్లకు ప్రజలు వెళ్లడం లేదు. ఇలాంటి వ్యాధులు వస్తే ఏం చేయాలన్న విషయంపై ఆన్ లైన్ గేమ్స్, విడియోలను చూస్తున్నారు. మొదట్లో మార్కెట్లు, వ్యాపారాలు, లగ్జరీ వస్తువుల అమ్మకాలు బాగా దెబ్బతిన్నాయి. షేర్ మార్కెట్ కూడా కుదేలైంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగుపడుతోంది ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తనిఖీలు, వ్యాధి లక్షణాల కోసం చెకప్ లు జరుగుతున్నాయి.

ఉత్తర కొరియా జనవరి 22 నుంచి టూరిస్టులను దేశంలోకి అనుమతించడం లేదు. వుహాన్ లో జరగాల్సిన ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫయర్స్ రద్దయ్యాయి. చైనాలోనైతే ఈ వ్యాధి సోకి, ప్రభుత్వానికి తెలియచేయని వారిని శాశ్వత చారిత్రిక అవమానానికి గురి చేస్తామని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Next Story