• మొత్తం 31 ప్రావిన్సుల్లోనూ కరోనా కేసులు
  • టిబెట్ లోనూ బైటపడ్డ ఓ కరోనా కేసు
  • టిబెట్ ఒక్కటే దీని బారిన పడలేదన్న ధైర్యం మాయం
  • ఒక్క రోజులో 30 శాతం పెరిగిన కేసులు
  • మొత్తం 6.061కి చేరిన కరోనా కేసుల సంఖ్య
  • భారతీయ విద్యార్థుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
  • వైద్య పరీక్షలు చేశాకే ఇళ్లకు పంపించే ఏర్పాట్లు
  • వూహన్ ని విడిచిపెట్టిన భారతీయ విద్యార్థులు
  • ఇద్దరు ఆస్ట్రేలియన్లకూ కరోనా సోకినట్టు నిర్థారణ
  • ఓ పాకిస్తానీకి కరోనా సోకినట్టు నిర్థారణ

చైనాను ఇప్పుడు కరోనా గడగడా వణికిస్తోంది. ఒక్క రోజులో 30 శాతం కేసులు పెరిగిపోయాయి. కేవలం ఇరవై నాలుగు గంటల్లో చైనాలో కరోనా కేసుల సంఖ్య 6,061కి చేరింది. 2002 – 03 సంవత్సరంలో ప్రపంచాన్ని వణికించిన సార్స్ వైరస్ కేసుల బీభత్సంకంటే ఇది చాలా ఎక్కువ. ఇప్పటికే కరోనాబారినపడ్డ మృతుల సంఖ్య 170కి చేరింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ చెబుతున్న లెక్కలివి. మంగళవారం నుంచి కేవలం ఒకే ఒక్క రోజులో 1500 కేసులు పెరిగిపోయాయి. కరోనా సోకినవాళ్లందర్నీ పూర్తిగా ఐసోలేటెడ్ వార్డుల్లో ఉంచి చికిత్స చేస్తున్నారు.

వూహాన్ లో చిక్కుకుపోయిన 250 నుంచి 300మంది విద్యార్థుల్ని మన దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం తారా స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖ ఈ మేరకు చైనా ప్రభుత్వానికి అనుమతి కోరుతూ విజ్ఞప్తి చేసింది. అక్కడున్న విద్యార్థులంతా చైనాలో ఎంబిబిఎస్ చదివేందుకు వెళ్లినవాళ్లే.

ఇద్దరు ఆస్ట్రేలియన్లు, ఒక పాకిస్తానీకికూడా కరోనా సోకినట్టు అధికారులు ధృవీకరించారు. గౌండ్ డాంగ్ కి వెళ్తున్న సమయంలో పాకిస్తానీ విద్యార్థికి ఉన్నపళంగా సుస్తీ చేయడంతో ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన తర్వాత కరోనా అని బైటపడడంతో వెంటనే తనని ఐసోలేటెడ్ వార్డ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. జనవరి 21వ తేదీన తను వూహాన్ వదలివెళ్లినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 400మంది భారతీయ విద్యార్థులు వూహాన్ ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. నిజానికి అసలు అక్కడ ఉన్న విద్యార్థులు ఎంతమందో ఇప్పటివరకూ సరైన సమాచారంకూడా లేదు. ప్రభుత్వ అధికారులు చెబుతున్నదాన్నిబట్టి ఈ సంఖ్య 300 వరకూ ఉండొచ్చని తెలుస్తోంది.

కానీ ప్రైవేట్ సోర్స్ లు ఇస్తున్న సమాచారం ప్రకారం ఈ సంఖ్య 400 ఉండొచ్చని భావిస్తున్నారు. వీరిలో కనీసం నాలుగోవంతు విద్యార్థులకు కరోనా సోకే అవకాశాలు గట్టిగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. భారత దేశానికి రాగానే మొత్తం అందరు విద్యార్థుల్నీ ఐసోలేటెడ్ వార్డులకు తరలించి కరోనా వైరస్ సోకిందా లేదా అని పరీక్షలు జరిపేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

వూహాన్ కి దాదాపు 11 వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాపిటల్ సిటీ బీజింగ్ లోకూడా 111 కేసులు నమోదైనట్టు సమాచారం. వీరిలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. టిబెట్ లో కూడా ఒక కేసు బయటపడినట్టు చైనా అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ టిబెట్ లో అధికారికంగా ఈ వైరస్ వ్యాప్తి చెందినట్టుగా సమాచారం లేదు. ఇప్పుడు ఇక్కడికి కూడా పాకిందని తెలియడంతో చైనాలో ఉన్న మొత్తం 31 ప్రావిన్సుల్లోనూ కరోనా పాకినట్టే లెక్క.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.