థియేటర్లలో 'కరోనా వైరస్'
By తోట వంశీ కుమార్ Published on 1 Oct 2020 10:20 AM GMTఅన్‌లాక్-5 మార్గదర్శకాల్లో భాగంగా అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా.. దాదాపు ఏడు నెలల తరువాత థియేటర్లకు అనుమతి ఇవ్వడంతో.. సినీ ప్రియుల్లో ఆనందం నెలకొంది. కాగా.. థియేటర్లు ప్రారంభం కాగానే మొదటి చిత్రంగా తాను నిర్మించిన చిత్రాన్నే విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలోనే ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటిస్తూ వర్మ 'కరోనా వైరస్' చిత్రాన్ని రూపొందించారు. కరోనా సమయంలో బెదరకుండా బోల్డ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వర్మ. ఆర్జీవీ వరల్డ్ పేరుతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను క్రియేట్ చేసి సినిమాలను రిలీజ్ చేసాడు. కరోనా వైరస్ చిత్రాన్ని కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేయాలని బావించగా.. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కానుండడంతో.. అందులోనే విడుదల చేయనున్నట్లు వర్మ సోషల్ మీడియాలో ప్రకటించాడు.
‘కరోనా వైరస్’ మూవీ పోస్టర్‌ను పోస్ట్ చేసి.. ‘మొత్తానికి అక్టోబర్ 15 నుంచి అన్ని థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. సంతోషంగా ఉంది. లాక్‌డౌన్ అనంతరం థియేటర్‌లో విడుదలయ్యే సినిమాల్లో తన ‘కరోనా వైరస్’ మూవీనే మొదటిది’ అని క్యాప్షన్ జత చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఒక కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది అనేది చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. లాక్‌డౌన్‌లోనే ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశామని ఆర్జీవీ తెలిపాడు. శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి అగస్త్య మంజూ దర్శకత్వం వహించారు.