చైనా-రష్యా సరిహద్దు బంద్

By సుభాష్  Published on  31 Jan 2020 3:59 AM GMT
చైనా-రష్యా సరిహద్దు బంద్

చైనాలో ప్రబలిన కరోనా వైరస్ పొరుగుదేశాలను సైతం హడలెత్తిస్తోంది. తాజాగా, తమ దేశంలోకి ఈ ప్రమాదకర వైరస్ ను రానివ్వకుండా చేసేందుకు అన్ని దేశాలు రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే భారత్ సహా అనేక దేశాలు చైనాకు విమాన సర్వీసులు నిలిపివేశాయి. తాజాగా రష్యా, చైనాతో ఉన్న సరిహద్దును మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉన్నతస్థాయిలో ఉత్తర్వులు కూడా జారీ చేశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ర‌ష్యా ప్ర‌భుత్వం ప్రకటించింది. చైనా దేశ‌స్థుల‌కు ఎల‌క్ట్రానిక్ వీసాలు ఇవ్వ‌డం లేద‌ని ఆ దేశం పేర్కొన్న‌ది. తూర్పు దిశ‌లో ఉన్న బోర్డ‌ర్‌ను మూసివేసేందుకు అగ్రిమెంట్ కుదిరిన‌ట్లు ర‌ష్యా ప్ర‌ధాని మిఖ‌యిల్ మిషుస్తిన్ తెలిపారు. ప్ర‌జ‌ల్ని కాపాడుకునేందుకు వీలైన‌న్ని చ‌ర్య‌లు చేప‌ట్టక త‌ప్ప‌ద‌న్నారు. తమ దేశ పౌరులు కూడా చైనా పర్యటనలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని, చైనాలో వున్న రష్యాపౌరులు అక్కడి తమ దౌత్య కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. రష్యాలో ఇప్పటి వరకూ కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కేసు ఇప్పటి వరకూ ఒక్కటి కూడా నమోదు కానప్పటికీ, వైరల్‌ ఇన్ఫెక్షన్‌ను నిరోధించేందుకు వీలుగా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది

చైనాలో ఉన్న తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు అనేక దేశాలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన ఈ వైరస్ ముప్పు క్రమంగా ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటివరకు చైనాలో కరోనా వైరస్ కారణంగా 200లకుపైగా ప్రాణాలు కోల్పోయారు.

వాక్సిన్ కోసం విరాళాలు

కరోనా వైరస్‌ నిర్మూలన కోసం వ్యాక్సిన్‌ రూపొందించాలని ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం, అలీబాబా సంస్థ చీఫ్‌ జాక్‌మా చైనా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈమేరకు రూ.100 కోట్ల విరాళం అందజేసినట్టు ప్రకటించారు. తమ సంస్థ అందజేసిన విరాళాన్ని చైనా పరిశోధనా రంగానికి ఖర్చు చేయాలని చైనా సర్కారును కోరారు. చైనాలోని రెండు ప్రముఖ పరిశోధనా సంస్థలకు జాక్‌మా ఫౌండేషన్‌ నుంచి రూ.41.5కోట్లు అందజేయనున్నారు.

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తమ ఫౌండేషన్ తరపున కరోనా వైరస్‌ చికిత్సకు, వాక్సిన్‌ పరిశోధనలకు 10 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల సహాయాన్ని ప్రకటించారు. ప్రపంచంలోని ధనవంతులలో మూడవ స్థానంలో ఉన్న ఫ్రెంచి కుబేరుడు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 2.3 మిలియన్‌ డాలర్లు... ఫ్రాన్స్‌ కి చెందిన ‘కేరింగ్’ సంస్థ అధిపతి ఫ్రాంకోయిస్‌ పినాల్ట్‌ ఒక మిలియన్‌ డాలర్లను కరోనా వ్యతిరేక పోరాటానికి అందించారు.

అటు చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజాలు కూడా మేము సైతం అంటూ నడుం కట్టాయి. వాటిలో బైదు, టెన్సెంట్‌, టిక్‌టాక్‌ మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్‌ సంస్థలు సంయుక్తంగా 115 మిలియన్‌ డాలర్లు ప్రకటించాయి.చైనాకి చెందిన ఓ క్రీడా దుస్తుల తయారీ సంస్థ 1.4 మిలియన్‌ డాలర్లు తన వంతుగా విరాళమిచ్చింది. అటు హువాయ్‌ సంస్థ వుహాన్‌లో ని హౌషెన్‌షాన్‌ ఆసుపత్రి నిర్మాణంలో తన సహకారం అందించింది. కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ ను ఎదుర్కోవటానికి సుమారు 3.94 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లను కేటాయిస్తున్నట్టు చైనా ఆర్థిక శాఖ ప్రకటించింది.

Next Story