‘ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చింది..’ అన్న సామెతను ఊరికే వాడలేదు పెద్దలు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకు హడలెత్తిపోతోంది. ముఖ్యంగా చైనా నుండి ఏదైనా వస్తువులను దిగుమతి చేసుకోవాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పుడు చైనీస్ ఫుడ్ ను కూడా తినకుండా ఉండాలని భావిస్తున్నారు చాలా మంది. ముంబైలోని రెస్టారెంట్లలో చైనీస్ ఫుడ్ కు బాగా డిమాండ్ తగ్గిపోయిందని రెస్టారెంట్ ఓనర్లు చెబుతున్నారు. ఏదైనా పేస్టు లాంటిది చైనాలో తయారయ్యి ఇక్కడికి వచ్చిందా అంటూ కష్టమర్లు ఆర్డర్స్ ఇచ్చే ముందు అడుగుతున్నారు. తాము వంటల్లో వాడే వస్తువులన్నీ భారతదేశంలోనూ, సింగపూర్ లోనూ తయారవుతూ ఉన్నవేనని.. ఎటువంటి భయం అవసరం లేదని హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి.

హోటల్స్ లో చైనీస్ వంటకాలను ఆర్డర్ ఇచ్చే ముందు ఫోన్ చేసి పలు ప్రశ్నలు అడుగుతున్నారని అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. ఎప్పుడైతే చైనాలో కరోనా వైరస్ అన్నది వ్యాప్తి చెందుతోందో.. అప్పటి నుండే ఈ ఎంక్వయిరీలు మొదలయ్యాయని చెబుతున్నారు. ముఖ్యంగా చైనీస్ ఫుడ్ ఐటెమ్స్ ను తినడం బాగా తగ్గించినట్లు తెలుస్తోంది. హోటల్ యాజమాన్యాలు కూడా చైనా నుండి వస్తువులను దిగుమతి చేసుకోవడం ఆపివేశాయి. ఫోరమ్ ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ ఫౌండర్ డైరెక్టర్ అమిత్ లొహానీ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇలానే కొనసాగితే వ్యాపారాలపై చాలా ప్రభావం పడుతుందని అన్నారు. చాలా చైనీస్ రెస్టారెంట్లు మేడిన్ చైనా ప్రోడక్ట్స్ ను వాడడం మానేశాయని.. వాటి స్థానంలో వేరే పదార్థాలను వాడడం మొదలుపెట్టారని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఎటువంటి సమస్యలు లేవని.. కొన్ని చైనీస్ రెస్టారెంట్లు చైనా నుండి వచ్చే తాజా ఆర్డర్స్ ను ఆపివేశాయని అన్నారు. చాలా వరకూ స్పెషల్ చైనా నుండి వచ్చేవని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ నుండి తాము తీసుకొంటామని.. కానీ ఫుడ్ రెగ్యులేటర్ అప్రూవ్ చేశాకనే వాటిని వంటల్లో వాడుతారని చెప్పుకొచ్చారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ పరిస్థితి మారే అవకాశం ఉందని అన్నారు.

గోవాలో మాత్రం వెరేలా..

ఢిల్లీ లోని జేపీ వసంత్ కాంటినెంటల్ హోటల్ లో పనిచేసే ఛెఫ్ యోంగిలాంగ్ వాంగ్ మాట్లాడుతూ “తాము వాడే చాలా పదార్థాలు థాయ్ లాండ్, హాంగ్ కాంగ్ నుండి తెప్పిస్తున్నామని.. రాబోయే కొన్ని వారాల వరకూ ఎటువంటి ఇబ్బందులు లేవు” అని చెప్పుకొచ్చాడు. “మీడియాలో చైనా గురించి, కరోనా వైరస్ గురించి విపరీతమైన హైప్ రావడం కారణంగా చైనీస్ ఫుడ్ ఐటమ్స్ ను ఆర్డర్ ఇవ్వడానికి, చైనీస్ రెస్టారెంట్లకు వెళ్ళడానికి ప్రజలు భయపడుతున్నారని” అన్నాడు.

గోవాలోని ఫైవ్ స్టార్ హోటల్ లో మాత్రం పరిస్థితి వేరేగా ఉందని తెలుస్తోంది. వేడి..వేడి గార్లిక్ సాస్ లో చికెన్ ను టేస్ట్ చేయడానికి ఎగబడుతున్నారట. స్పెషాలిటీ రెస్టారెంట్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన అంజాన్ ఛటర్జీ మాట్లాడుతూ తమ వ్యాపారంపై ఎటువంటి ప్రభావం చూపడం లేదని.. అంతా సాఫీగా సాగుతోందని అన్నారు. మెయిన్ ల్యాండ్ చైనా, ఆసియా కిచెన్.. ఇవన్నీ స్పెషాలిటీ రెస్టారెంట్స్ కిందకే వస్తాయి. తమ రెస్టారెంట్లలో చాలా వరకూ భారతదేశంలో తయారైనవేనని అంజాన్ ఛటర్జీ చెప్పుకొచ్చారు. కేవలం 10 శాతం ప్రత్యేకమైన పదార్థాలు మాత్రమే విదేశాల నుండి దిగుమతి చేసుకుంటామని అన్నారు. అవి కూడా సింగపూర్, ఇండొనేషియా, మలేషియాల నుండి వస్తాయని ఆయన హామీ ఇచ్చారు.

చాలా దేశాలు ఇప్పటికే చైనా నుండి దిగుమతులను ఆపేసాయి. ఇండోనేషియా కూడా ఆ లిస్టు లోకి చేరింది. యూకేలో కూడా చైనీస్ ఫుడ్ కు డిమాండ్ చాలా తగ్గిందని తెలుస్తోంది.ఇతర దేశాల్లో కూడా చైనీస్ ఫుడ్ ను తీసుకోవడానికి జంకుతున్నారట.. ఏది ఏమైనా కరోనా వైరస్ వార్తలు బయటకు వచ్చాక చైనీస్ రెస్టారెంట్ల ఆదాయం భారీగా తగ్గింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.