భారత్‌లో 12లక్షలకు చేరువైన కరోనా కేసులు
By తోట వంశీ కుమార్ Published on 22 July 2020 10:23 AM ISTదేశంలో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 37,724 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 648 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,92,915కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 28,732 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 7,53,050 కోలుకుని డిశ్చార్జి కాగా.. 4,11,133 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,47,24,546 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,43,243 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. అత్యధిక కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ ఇప్పటి వరకు 3.1లక్షల కేసులు నమోదు కాగా.. 12,030 మంది మరణించారు. తమిళనాడులో 1.765లక్షల కేసులు నమోదు కాగా.. 2,551 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీల్లో 1.24లక్షల కేసులు నమోదు కాగా.. 3,663 మంది మృత్యువాత పడ్డారు.
ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా.. రెండో స్థానంలో బ్రెజిల్ ఉన్నాయి. ఇక అత్యధిక మరణాలు చోటు చేసుకున్న దేశాల జాబితాలో భారత్ 7వ స్థానానికి చేరింది. ఇప్పటి వరకు 28,400 మరణాలతో ఈ స్థానంలో ఉన్న స్పెయిన్ ప్రస్తుతం 8వ స్థానంలోకి వెళ్లింది.