కరోనా వైరస్‌పై డబ్ల్యూహెచ్‌వో షాకింగ్‌ న్యూస్‌

By సుభాష్  Published on  8 July 2020 10:30 AM IST
కరోనా వైరస్‌పై డబ్ల్యూహెచ్‌వో షాకింగ్‌ న్యూస్‌

కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక కరోనా లక్షణాలు ఇప్పటి వరకు ఎన్నో వెల్లడించారు వైద్యనిపుణులు. రోజురోజుకు కరోనా గురించి కొత్త కొత్త విషయాలు బయటపడటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. కోవిడ్‌-19 గాలిలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇది 8 గంటల పాటు గాలిలో ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో (who) స్పష్టం చేసింది. ఇకపై ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డబ్ల్యూహెచ్‌వో అధికారులు సూచిస్తున్నారు. అలాగే మాస్క్‌ లే కాకుండా భౌతిక దూరం తప్పనిసరి అని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో పని చేసే వైద్య సిబ్బంది పూర్తిగా రక్షణ కల్పించే దుస్తులను మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.

గతంలో తుమ్మిన, దగ్గిన, ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్లు ఇతరుల మీద పడితే కరోనా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇందుకు మోచేతిని అడ్డం పెట్టుకుని తుమ్మాలని, అదే విధంగా చేతులను సైతం తరచూ శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య సంస్థ నిపుణులు సూచిస్తున్నారు.

వైరస్‌ రోజుకో కొత్త రూపాంతరం

అయితే కరోనా వైరస్‌ రోజుకో కొత్త రూపాంతరం చెందుతుందని నిపుణులు చెబుతున్న మాటలకు బలం చేకూరుతుంది. గాలిద్వారా సంక్రమిస్తుందని, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతూ డబ్ల్యూహెచ్‌వోకు చాలా మంది శాస్త్రవేత్తలు లేఖలు కూడా రాశారు. ఇక గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందన్న సూచనలు, సిఫార్సులను సవరించాలని కోరుతూ డబ్ల్యూహెచ్‌వోకు శాస్త్రవేత్తలు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు పరిశోధనల మేరకు డబ్ల్యూహెచ్‌వో ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.

మరిన్ని పరిశోధనలు

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తోందని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో ఈ విషయమై మరిన్ని పరిశోధనలు చేపట్టి ప్రకటిస్తామని చెబుతోంది. కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. అయితే ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపించవచ్చన్న అంశంపై ఇంకా గట్టి ఆధారాలు కూడా లభ్యమవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. మొదట అంచనా వేసినదానికన్నా ఇది కొంత వరకు ఆందోళనకరంగా ఉందని, గాలి ద్వారా వ్యాపిస్తోందా..అన్న విషయమై నూతన శాస్త్రీయ ఆధారాలను మరికొన్ని రోజుల్లో వెల్లడిస్తామని తెలిపింది. రెండు మీటర్ల దూరానికి మించి కూడా ఈ వైరస్‌ ప్రయాణిస్తోందని, గాల్లో దీని సూక్ష్మ కణాలు ఉన్నట్లు తెలుస్తోందని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌కు లేఖ రాసింది. దీనిపై తాము అధ్యయనం చేస్తున్నట్లు ప్రకటించింది.

Next Story