బాబోయ్ కరోనా..!
By అంజి
చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై అప్రమత్తమైన డబ్ల్యుహెచ్ఓ దీనిపై చర్చించేందుకు బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ముందుగా వుహాన్ నగరంలో వెలుగు చూసిన ఈ వైరస్ బీజింగ్ షాంఘై నగరాలకు విస్తరించింది. ఇప్పటికే 217 వైరల్ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదవగా, అందులో 198 కేసులు వుహాన్ నగరంలోనే నమోదయ్యాయని, మరో నాలుగు కేసులు జపాన్, ద.కొరియా, థారులండ్‌ల్లో నమోదయ్యాయని డబ్ల్యుహెచ్ఓ వర్గాలు వెల్లడించాయి. వుహాన్ నగరంలో వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్ న్యుమోనియా కేసులను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం వుందని చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ దేశ ప్రజలనుద్దేశించి జాతీయ టీవీలో చేసిన ప్రసంగంలో చెప్పారు. వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది లో 15 మందికి ఈ వ్యాధి సోకినట్టు అనుమానాలు రావడంతో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
కరోనా వైరస్ అంటే ?
లాటిన్ పదం కరోనా అంటే కిరీటం అని అర్థం నుంచి ఈ పేరు వచ్చింది. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు రాజులు ధరించే కిరీటం ఆకృతిలో కన్పిస్తుందట. కరోనావైరస్ ఎక్కువగా పక్షులు, క్షీరదాలలో ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతోంది. తరువాత ఈవైరస్‌ల్లో మార్పులు జరిగి మనిషికి ప్రాణాంతక వైరస్‌లుగా మారాయని వైద్య పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు రకాల హ్యూమన్ కరోనా వైరస్‌లను గుర్తించారు. ప్రస్తుతం చైనాలోని ఊహన్ నగరంలో విజృంభిస్తున్న వైరస్‌ను నోవెల్ కరోనా వైరస్‌గా గుర్తించారు. గతంలో సార్స్, మెర్స్ వైరస్‌లు కూడా చైనాలో విజృంభించినపుడు వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
లక్షణాలు
ఈ వైరస్ మానవుల్లో ఊర్ధ్వ శ్వాసకోశ వ్యాధులకు జీర్ణాశయ వ్యాధులకు కారణమవుతోంది. వైరస్ సోకిన రెండు లేదా మూడు రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. మైల్డ్, మోడరేట్ లక్షణాల్లో రన్నింగ్ నోస్, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం, నీరసం, నిస్సత్తువ, ఫ్లూ జ్వరం, కామన్ కోల్డ్ లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్‌లు శ్వాస నాళాలు, శ్వాస కోశాలకు వ్యాపించినప్పుడు బ్రాంకైటీస్, న్యూమోనియా లక్షణాలు బయటపడతాయి. రానురాను తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు, ఊపిరి పీల్చడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.
వైరస్ వ్యాప్తి
హ్యూమన్ కరోనా వైరస్‌లు వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాప్తి చెందుతాయి. వైరస్ సోకిన వ్యక్తులు తుమ్మడం, దగ్గడం వల్ల వెలువడే లాలాజల తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తిచెందుతోంది. ఆ తుంపరలతో కలుషితమైన దుస్తులు, ఇతర వస్తువులు, కరచాలనం, తాకడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి ప్రవేశిస్తుంది. అరుదుగా మలమూత్రాల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.
జాగ్రత్తలు
మంచినీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. వ్యాధిపై అప్రమత్తతో ఉండి ముఖానికి మాస్క్ ధరించాలి. వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలకు, కోళ్ల ఫారాలు, జంతు సంరక్షణ శాలలు, కబేళాల దగ్గరకు వెళ్లకూడదు. అనుమానితులకు, ఇతురులకు దూరంగా ఉండాలి. దగ్గినా, తుమ్మినా, కర్చీప్ అడ్డుపెట్టుకోవాలి. తరుచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
అప్రమత్తమైన దేశాలు
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. చైనా ముఖ్యంగా ఉహాన్ నుంచి తమ దేశానికి వస్తున్న పర్యాటకులకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణకొరియా దేశాలు విమానాశ్రయాల్లోనే హెల్త్ చెకప్‌లు చేస్తున్నారు. భారత్ కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికుల కోసం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.