వెల్లుల్లి రసంతో కరోనా నయమవుతుందా !?
By రాణి
అసలే కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడ లాడిస్తుంటే.. ఈ వైరస్ కారణంగా 24 వేల మందికిపైగా చనిపోయారంటూ చైనాకు చెందిన అతిపెద్ద ఆన్‌లైన్ న్యూస్ వెబ్‌సైట్ ‘టెన్‌సెంట్’లో ప్రచురించడం సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 564 అని చైనా అధికారికంగా వెల్లడిస్తోంది. కానీ.. కరోనా వైర్‌స్ పై ఆ వెబ్‌సైట్ చాలా రోజులుగా ‘ఎపిడమిక్ సిచ్యువేషన్ ట్రాకర్’ పేరుతో ఒక ట్రాకర్‌ను తన సైట్‌లో పెట్టింది. కరోనా మృతులు, అనుమానితులు, ఆ వైరస్ బారిన పడినవారి సంఖ్యను అందులో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే.. కరోనా వైరస్ సోకినవారి సంఖ్య లక్షా 50 వేలుగానూ, మృతుల సంఖ్య 25 వేలుగా ఆ ట్రాకర్ చూపించింది.
అంటే.. అధికారిక లెక్కలకన్నా 80 రెట్లు ఎక్కువ. అయితే ఈ సంఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం కావడంతో.. ఆ వెబ్‌సైట్ వెంటనే తన ట్రాకర్‌లో నంబర్లను అధికారిక గణాంకాలకు అనుగుణంగా సర్దుబాటు చేసింది. అయితే చైనాలో పరిస్థితి విషమించిందని.. కానీ, ఆ విషయం బయటపడకుండా సర్కారు దాస్తోందని, టెన్‌సెంట్ ఫిబ్రవరి 1న తన ట్రాకర్‌లో పెట్టిన గణాంకాలే ఇందుకు నిదర్శనమని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఫిబ్రవరి 1 ముందు వరకూ టెన్‌సెంట్ వెబ్‌సైట్ వాస్తవ గణాంకాలనే ఇచ్చిందని, ఆ తర్వాత ప్రభుత్వం చేసిన హెచ్చరికలతో వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న తీరు చూస్తుంటే.. ఒక్క వూహాన్‌లోనే లక్ష నుంచి 3.5 లక్షల మందికి సోకి ఉండొచ్చని వైద్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని ముందే హెచ్చరించిన వుహాన్ డాక్టర్ లీ వెన్‌లియాంగ్ అదే వైరస్ బారిన పడి మృతి చెందారు. సీఫుడ్ మార్కెట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు తన ఆస్పత్రిలో చేరారని, వారిని పరీక్షించగా సార్స్ బారిన పడ్డారని తేలిందని, దేశంలో ఈ వైరస్ విస్తరించే ప్రమాదం ఉందంటూ లీ.. డిసెంబరు 30న తన వీ చాట్ గ్రూప్‌లో హెచ్చరించారు. ఈ పోస్టు చేసినందుకు పోలీసులు ఆయనను ఇబ్బంది పెట్టారు. కరోనా బారిన పడి జనవరి 12 నుంచి చికిత్స పొందుతున్న ఆయన.. చివరకు మృతి చెందారు.
వెల్లుల్లి రసంతో ‘కరోనా’ నయం కాదని తేటతెల్లమైంది. అయితే వెల్లుల్లి మాత్రమే కాదు.. నువ్వుల నూనె, మౌత్ వాష్‌ల వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ మేరకు ‘కరోనా చికిత్స’పై వస్తున్న పుకార్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టిపారేసింది.
దేశ దేశానా కరోనా
ఒక్క చైనాలోనే కాకుండా 27 దేశాల్లో దాదాపు 260 మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో.. కరోనా ముప్పును ఎదుర్కోవడానికి 675 మిలియన్ డాలర్లు కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచదేశాలకు తెలిపింది. చైనా నుంచి తరలించిన 645 మంది భారతీయులకూ వైద్యపరీక్షలు చేయించగా.. కరోనా నెగెటివ్ వచినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.