అమానవీయం : నడిరోడ్డుపై మూడు గంటలకుపైగా మృతదేహం
By Medi Samrat Published on 19 July 2020 6:27 PM ISTకరోనా మహమ్మారి కారణంగా మనిషిలో ఏ మూలనో దాగివున్న కాస్తోకూస్తో మానవత్వం కూడా చచ్చిపోతుంది. తద్వారా మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. పక్కోడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. కరోనా అంటుకుంటుదేమోనని కనీసం ఆ వైపు చూసేందుకు కూడా ధైర్యం చేయలేకపోతున్నారు మనుషులు.
తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డుమీదకు వచ్చారు. ఈ క్రమంలోనే శ్వాస ఆడటంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలి కన్నుమూశాడు.
సంఘటనా స్థలానికి దగ్గర్లోనే చాలామంది ఉన్నా.. కరోనా సోకుతుందేమోనన్న భయంతో అలానే చూస్తూ ఉండిపోయారు. అయితే ఇరుగుపొరుగు వారు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తే కుటుంబ సభ్యులందరికీ వైరస్ సోకుతుందని భావించి ఏ ఒక్కరూ కూడా బయటకు రాలేదు. సుమారు మూడు గంటల పాటు నడిరోడ్డుపైనే మృతదేహం అలాగే ఉండిపోయింది. సమచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలం నుండి మృతదేహాన్ని తరలించారు.