వచ్చే ఏడాది ప్రారంభంలోనే కరోనా వ్యాక్సిన్: కేంద్ర మంత్రి
By సుభాష్ Published on 13 Oct 2020 2:22 PM ISTభారత్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కరోనా వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రుల బృందం భేటీ అయిన నేపథ్యంలో వ్యాక్సిన్ అందుబాటు, పంపిణీ అంశాలపై ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని డబ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 కరోనా వ్యాక్సిన్లు వివిధ దశలో ఉండగా, వాటిలో 10 వ్యాక్సిన్లు కీలకమైన మూడో దశలో ఉన్నాయని అన్నారు. వీటి భద్రత, సామర్థ్యం మనకు వెల్లడి కావాల్సి ఉందని అన్నారు. ఈ అంశాల ఆధారంగా చూస్తే ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా మృతుల సంఖ్య పెరిగింది. వ్యాక్సిన్ తయారీ కోసం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు పలు దశల్లో ఉంటే, మరి కొన్ని వ్యాక్సిన్లు చివరి దిశలో ఉండటంతో ఈ ఏడాదిలోనే వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. కరోనాకు ఎన్ని చర్యలు చేపట్టినా.. అది పలు రకాలుగా రూపాంతరం చెంది తీవ్రంగా విజృంభిస్తోంది.