కరోనా మృతులు: వారికి రూ.5 లక్షల పరిహారం.. సీఎం జగన్‌ హామీ

By సుభాష్  Published on  13 Oct 2020 7:03 AM GMT
కరోనా మృతులు: వారికి రూ.5 లక్షల పరిహారం.. సీఎం జగన్‌ హామీ

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎందరినో పొట్టన పెట్టుకుంటోంది. ఇప్పటికే కరోనా బారిన ఎంతో మంది ప్రాణాలు విడిచారు. వీరిలో ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నారు. వైరస్‌ నుంచి ప్రజలను రక్షించేందుకు వీరంతా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. ఈ నేపథ్యంలో కరోనా విపత్కర సమయంలో ముందుండి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు ఏపీ సర్కార్‌ ముందుకొచ్చింది. వైరస్‌పై పోరులో మృతి చెందిన ప్రతి జర్నలిస్టుకు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ అధ్యక్షుడు కె. శ్రీనివాస్‌రెడ్డి ఈ విషయాన్ని మంగళవారం మీడియా ముందు వెళ్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కరోనా వల్ల ఎంతో మంది మరణిస్తున్నారు. దీనిలో జర్నలిస్టులు కూడా మృత్యువాత పడ్డారు. వార్త సేకరణలో భాగంగా అందరు ముందుండి నడిచారు. ప్రధాని కూడా జర్నలిస్టులు కరోనా వారియర్స్‌ అని తెలిపారు. జర్నలిస్టులను ప్రభుత్వాలు కూడా సహకారం అందించాలి. 50 లక్షలు బీమా ఇవ్వాలని కోరుతున్నాం. ఏపీలో 38 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి మృతి చెందారు. వారిని ఆదుకోవాలని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అని అన్నారు. 38 మంది మృతి చెందినట్లు సీఎం జగన్‌ చెప్పారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు 5 లక్షలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే చికిత్స తీసుకునేవారికి ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్‌కు కృతజ్ఞతులు తెలిపారు.

Next Story