ముఖ్యమంత్రి నివాసంలో 80 మందికి కరోనా పాజిటివ్‌..!

By సుభాష్  Published on  11 July 2020 9:32 AM GMT
ముఖ్యమంత్రి నివాసంలో 80 మందికి కరోనా పాజిటివ్‌..!

దేశంలో కరోనా వైరస్‌ ఎవ్వరిని వదలడం లేదు. చాపకింద నీరులా వ్యాపిస్తూ అతలాకుతలం చేస్తోంది. ఇక దేశంలో లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతున్నాయి. ఇక బీహార్‌ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అలాగే ముఖ్యమంత్రి నితీస్‌కుమార్‌ నివాసానికి తాకింది. ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్‌ కార్యాలయంలో పని చేస్తున్న 80 మందికిపైగా సిబ్బందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్యాంప్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

సీఎం నితీష్‌ కుమార్‌ మేనకోడలు కూడా కరోనా బారిన పడి పాట్నాలోని ఎయిమ్స్‌ లో చేరారు. ఇక పాట్నా మెడికల్‌ కాలేజ్‌, ఆస్పత్రుల్లో ముగ్గురు వైద్యులు, ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో పీఎంసీహెచ్‌లో పాజిటివ్‌ ఉద్యోగుల సంఖ్య 44కు చేరుకుంది. కాగా, సీఎం నివాసంలో 80 మంది వరకు కరోనా సోకడంతో తీత్ర కలకలం రేగింది. కార్యాలయ కార్యదర్శి డ్రైవర్‌కు కరోనా సోకగా, ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం.

కాగా, పాట్నాలో ఒకే రోజు అత్యధికంగా 385 మందికి పాజిటివ్‌ రాగా, ఇప్పటి వరకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,888కు చేరింది. వీరిలో 1,180 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకూ 14,330 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 10,251 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Next Story