హైదరాబాద్‌లో గత 35 రోజుల్లో 6.60లక్షల మందికి కరోనా: సీసీఎంబీ పరిశోధన వెల్లడి
By సుభాష్ Published on 19 Aug 2020 4:51 PM ISTకరోనా వైరస్ సోకిన వారి నాసిక ద్రవాలు, నోటి మార్గాల ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్ బయటపడుతుందని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు తెలిపారు. దీని వల్ల మురుగు నీటి పరీక్షల ద్వారా వివిధ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నిర్ధారించవచ్చని, మురుగు నీటిలో చేరిన వైరస్ రోగ కారకం కాదని, దీన్ని సంక్రమిత పరిస్థితిని అర్థం చేసుకునేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారి విసర్జితాలు సరాసరి 35 రోజుల వరకు వైరస్ పదార్థాలు విడుదలవుతాయని సీఎస్‌ఐఆర్, సీసీఎంబీ, ఐఐసీటీలు జరిపిన సంయుక్త పరిశోధనల ద్వారా గుర్తించారు.
అయితే హైదరాబాద్ నగరంలో ఉపయోగిస్తున్న 1800 మిలియన్ల నీటిలో 40 శాతం వివిధ మురుగు నీటి శుభ్రపరిచే కేంద్రాలలో పరిశోధనల ద్వారా నగరంలో వ్యాధి సోకిన వారి సంఖ్యను గుర్తించినట్లు సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) డైరెక్టర్ డా. రాకేష్ పేర్కొన్నారు. ఈ పరీక్షలు 80శాతం మురుగునీటి కేంద్రాల్లో నిర్వహించిన అనంతరం సుమారు 2 లక్షల మంది విసర్జితాలలో వైరస్ విడుదలైనట్లు నిపుణులు నిర్ధారించారు. కేవలం 40శాతం మురికి నీరు మాత్రమే ఈ కేంద్రాల్లో చేరుతున్న కారణంగా అంచనాల ప్రకారం.. హైదరాబాద్‌లో గత 35 రోజుల్లో 6.60లక్షల మంది కరోనా బారిన పడి సాధారణ స్థితికి వచ్చారని సీసీఎంబీ పరిశోధన వెల్లడించింది. అలాగే ప్రస్తుత పరిశోధనల ఊహాగానాల ప్రకారం 2.6 లక్షల మంది కరోనా వ్యాధిగ్రస్తులున్నట్లు పేర్కొంది.
ఈ పరిశోధనల ప్రకారం.. చాలా మంది కరోనా రోగ లక్షణాలు లేనివారు ఆస్పత్రుల్లో చేరడం అవసరం లేదని తెలుస్తోంది. ఆరోగ్య వ్యవస్థలు ఈ మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా సమర్ధవంతంగా పని చేస్తున్నాయని, పౌర సంస్థల సహకారంతో ఈ వ్యాధిని తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించడం, దీనిని నిరోధించడానికి సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ తెలిపారు.