కరోనాపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎంత వరకు నిజం..!
By సుభాష్ Published on 26 March 2020 9:34 PM ISTకరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. అయితే కరోనా వైరస్ వల్ల చాలా మందిలో ఎన్నో అపోహాలు, అనుమానాలున్నాయి. కరోనాపై నిజనిజాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఇక కరోనాపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకు సమాచారాన్ని ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది.
వేడి ఉన్న ప్రదేశాల్లో కరోనా రాదా..?
ఇక ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరోనా వైరస్ రాదని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా మనదేశంలో వచ్చే రెండు నెలలు ఎండలు అధికంగా ఉంటాయి. కాబట్టి కరోనా గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు భావిస్తున్నారు. ఇది అపోహా మాత్రమే. సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి వేడిగా ఉండే ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాపించింది. చైనాలోని అన్ని రకాల వాతావరణ ప్రాంతాల్లో వైరస్ సోకినందున వేడి వాతావరణంలో కరోనా రాదనుకోవడం శాస్త్రీయంగా ఆధారాలే ఏవి లేవని హార్వర్డ్ మెడికల్ స్కూల్ వెల్లడించింది. సార్స్, ఇతర వైరస్‌లతో కరోనాను పోల్చకూడదని పేర్కొంది.
అయితే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే దశలో ఉపరితల ఉష్ణోగ్రత ప్రభావం కరోనా సజీవంగా ఉండే వ్యవధిపై ఎంతోకొంత ప్రభావం ఉండోచ్చనే అభిప్రాయం కూడా ఉంది. ఆ మేరకు మన దేశంలోని అధిక ఉష్ణోగ్రతలు కరోనా వ్యాప్తిని తగ్గించడంలో కొంత అవకాశం ఉంది.
పిల్లలకు కరోనా రాదా..?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వయోజనుల్లోనే కరోనా బాధితులు ఎక్కువగా ఉన్నారు. దీంతో పిల్లలకు కరోనా రాదనే అపోహ చాలామందిలో ఉంది. ప్రస్తుతం ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా కరోనా సోకే అవకాశం ఉంది.
సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతను గుర్తించడానికి ప్రాథమిక దశలో థర్మల్ స్కానర్ ఉపయోగపడుతుంది. ఎయిర్ పోర్టుల్లో, రైల్వే స్టేషన్‌లలో వీటిని ఎక్కువగా వాడుతారు. కానీ కరోనా సోకిన వారికి వ్యాధి లక్షణాలు వెంటనే బయటపడకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో థర్మల్ స్కానర్‌తో సాధారణ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకి ఉంటే ఆ తర్వాత 2 నుంచి 10 రోజుల్లో ఎప్పుడైనా కరోనా నిర్ధారణ కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
పది సెకన్ల పాటు ఆపకుండా గాలి పీల్చితే వైరస్ లేనట్లేనా..?
కరోనా గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. మనిషి పది సెకన్లపాటు ఆపకుండా గాలి పీల్చగలిగితే కరోనా లేనట్లేనని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది పెద్ద అపోహా మాత్రమేనని ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఊపిరితిత్తుల సమస్య వల్ల తీవ్రంగా ఇబ్బందిపడేవారిని గుర్తంచడానికి ఇలాంటివి కొంత వరకు ఉపయోగించవచ్చని చెబుతున్నారు. కానీ కరోనా ఇతర వైరస్‌లకంటే భిన్నమైనది. వ్యాధి సోకిన కొన్ని రోజుల వరకు ఎలాంటి ఇబ్బందులు బయటపడవని, కరోనా వైరస్ లాంటి వాటిని గుర్తించడానికి ఎలాంటి ఆన్‌లైన్ పరీక్షలు లేవని ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇక ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అనిపిస్తేనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తోంది.
నీళ్లు అధికంగా తాగితే కరోనా రాదా..?
ప్రతి 15 నిమిషాలకోసారి నీళ్లు తాగితే వైరస్ గొంతులో నుంచి కడుపులోకి పోతుందని, తర్వాత కడుపులో యాసిడ్‌ల కారణంగా అది చనిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టి పారేసింది. కేవలం ఇది అపోహా మాత్రమేనని వెల్లడించింది. ఉపిరితిత్తులకు సోకే వైరస్ ఇలా చనిపోవడానికి ఎలాంటి శాస్త్రీయంగా ఆధారాలు లేవని పేర్కొంది. కాగా, నీళ్లు బాగా తాగుతూ డీహైడ్రేషన్ రాకుండా చూసుకుంటే ఆరోగ్యానికి మంచిదని తెలిపింది.