కరోనా.. ప్రతి దశా సవాలేనా..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  21 Aug 2020 8:22 AM GMT
కరోనా.. ప్రతి దశా సవాలేనా..!

కరోనా చికిత్సలో అన్నిటి కంటే ప్రధానం మనోబలం. దీన్ని మించిన మందు లేదు. మనం ధైర్యంగా ఉంటే మందులు కూడా పనిచేస్తాయి అంటున్నారు. వైద్యులు. గత అయిదు నెలలుగా కరోనా వ్యాధి వస్తున్న తీరుతెన్నును పరిశీలిస్తే.. ప్రతి దశా అటు బాధితులకు ఇటు వైద్యులకు ఓ సవాల్‌గానే నిలిచిందని చెప్పవచ్చు. మొదట్లో కరోనాకు చికిత్సకోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. కరోనా ఎలా వస్తుందనేదానితో పాటు ఎవరికి త్వరగా వస్తుందన్న విషయంగా కూడా చాలా విషయాల్లో తొలుత అస్పష్టంగా ఉండేది. కరోనా వయసుపైబడ్డవారికే వస్తుంది.. చిన్నవాళ్ళకు, యువతకు భయం అక్కర్లేదని మొదట వినవచ్చింది. కానీ తర్వాతర్వాత వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ వస్తుండటంతో ఈ వ్యాధి అందరికీ వ్యాపిస్తుందని నిర్ధరించారు. మూతికి మాస్కు, చేతిని శానిటైజర్లతో శుభ్రపరచుకోవడం మాత్రం అప్పటికీ ఇప్పటికీ డాక్టర్లు చెబుతున్న ప్రాథమికాంశాలే!

కరోనా వచ్చిందని ఎలా తెలుస్తుందన్న ప్రశ్నకు మొదట్లో దగ్గు,జ్వరం, తుమ్ములు వస్తాయని తేల్చారు. అప్పట్లో ఎవరు కాస్త దగ్గినా పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడి బెంబేలెత్తిపోయేవారు. కానీ తర్వాత ఈ లక్షణాలేవీ లేకుండాకూడా కరోనా వచ్చే ప్రమాదముందని తేల్చారు. కరోనా సింమ్పటమాటిక్‌.. అసింమ్పటమాటిక్‌ అని వర్గీకరించారు. అంటే కొందరికి తీవ్రంగా వస్తుంది. అది వచ్చిన లక్షణాలు వెంటనే బైటికి కనిపిస్తాయి. మరికొందరికి మాత్రం ఏదో సాధారణ జలుబులా వచ్చి పలకరించి వెళ్ళిపోతుంది. ఇది ఇప్పటికీ అంగీకరిస్తున్న వాస్తవం. మనదేశంలో చాలా మందికి ఈ కరోనా తెలీకుండానే వచ్చి వెళ్ళిందని నిపుణుల అంచనా.

మొదట్లో కరోనా వచ్చిందంటేనే వెలివేసేంత పని చేసేవారు. ఈ నాలుగు నెలల కాలంలో ఎన్నో ఉదంతాలు వెలుగు చూశాయి. అపార్ట్‌మెంట్‌లో ఎవరికైనా కరోనా వస్తే ఆ కుటుంబాన్ని అంటరానిదిగా చూసేవారు. మరణిస్తే ఆ మృతదేహాలను దహనం చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాని దుస్థితి. బంధాలు అనుబంధాలు అన్నీ దూదిపింజల్లా తేలిపోయిన పిదప కాలం ఈ కరోనా సమయంలోనే దాపురించింది. కరోనా వస్తే చావే అన్న «భయం ప్రజల్లో ప్రబలడంతో ఎవరికి వారు స్వార్థంతో వ్యవహరించడం ప్రారంభించారు. పల్లె ప్రజలు ఎవరినీ ఊర్లోకి రాకుండా ముళ్ల కంచెలు వేసేవారు. కొన్ని గ్రామాల వారు ఏకంగా రోడ్లపై గోడలూ కట్టేశారు. ఇదంతా గత దృశ్యం . ప్రస్తుతం పరవాలేదు. వ్యాధిపై ప్రజల అవగాహన పెరగడంతోపాటు అంటరాని భావన తగ్గుముఖం పట్టింది. అయితే కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లో మినహాయింపులు ఇచ్చినా ఇప్పటికీ ఇంటినుంచి బైటికి రావడానికి భయపడుతునే ఉన్నారు.

ఇక కోవిడ్‌ చికిత్స విషయానికొస్తే తొలుత ఈ వైరస్‌ ఊపిరితిత్తులను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుందని తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు ఈ దిశగానే ఆలోచించేవారు. అందుకే వెంటిలేటర్ల ప్రాధాన్యం పెరిగింది. సాధారణ ప్రజలు రోజూ ముఖానికి ఆవిరిపట్టడం, కషాయం చేసుకుని తాగడం ప్రారంభించారు. అయితే ఈ మాయదారి కరోనా రక్తాన్ని గడ్డ కట్టించే ప్రమాదకారి కూడా అని తెలుసుకున్నారు. ఈ దశలోనే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో గుండెకు ఇతర ప్రధానావయవాలకు రక్త ప్రసరణ జరగక.. అక్సిజెన్‌ అందక చాలా ఇబ్బందులు పడ్డారు.

ఎంబాలిజమ్‌ సమస్యతోనూ మరణం సంభవించవచ్చని తెలుసుకున్నాక చికిత్స విధానంలో ప్రాధాన్యాలు మారిపోయాయి. కొత్తగా ఆస్పిరిన్, హిపారిన్‌.. రక్తాన్ని పలచబార్చే మందులు ఇవ్వడం మొదలెట్టారు. రక్తంలో నిరోధకశక్తిగా ఉండే తెల్లరక్త కణాలు ఉత్పత్తి చేసే అల్సా డిఫెన్సిన్‌ అనే రసాయనం వల్లే రక్తం గడ్డకడుతోందని ఇజ్రెయిల్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే గౌట్‌ అనే కీళ్లవాతానికి వాడే మందు ‘కాల్ఫిసిన్‌’ ద్వారా దీన్ని నివారించవచ్చని తెలుసుకున్నారు. దీంతో కొందరి ప్రాణాలు నిలిచాయి.

ఆ తర్వాత హైపాక్సియా (రక్తంలో ఆక్సిజన్‌ మోతాదు తగ్గిపోవడం) ఉంటున్నట్లు తెలుసుకున్నారు. కరోనా కిట్‌లో ఆక్సిమీటర్‌ చేరింది. రోజూ బాధితులు ఆక్సిజన్‌ స్థాయుల్ని ఇది చెబుతుంది. హైపాక్సియా ఉన్న పేషెంట్‌కు ఆయాసం, ఊపిరి అందక పోవడం లాంటి సమస్యలు వచ్చేవి. అయితే కొందరిలో ఆక్సిజన్‌ తగ్గుతున్నా అది త్వరగా బైటికి కనిపించదు. దీన్నే హ్యాపీ హైపాక్సియా అంటారు. ఇలాంటి వారు అకస్మాత్తుగా కుప్పకూలి పోతుంటారు. అక్సీమీటర్‌ 93 శాతం కంటే తక్కువ చూపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

కరోనా బారిన పడి కోలుకున్నవారిలో యాంటీబాడీలు పెరుగుతాయి. మళ్ళీ వారికి ఈ ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశాలు దాదాపు లేవని డాక్టర్లు నమ్మకంతో చెబుతున్నారు. ఇలా కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మా తీసి రోగికి ఎక్కిస్తే నిరోధకశక్తి పెరుగతుంది. ఇలా ప్లాస్మా చికిత్స ద్వారా ఎందరో ప్రాణాలు గట్టెక్కాయి. కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా ఇవ్వడానికి ప్రముఖలెందరో ముందుకు వస్తుండటంతో సామాన్య ప్రజల్లో అపోహలు తొలుగుతున్నాయి. ఒకరు అయిదుసార్లు ప్లాస్మా ఇవ్వవచ్చని తాజా సమాచారం. అయితే వెంటిలేటర్‌ దశకు చేరుకున్న బాధితులకు ఈ ప్లాస్మా చికిత్స కుదరదని తెలుస్తోంది.

గత ఫిబ్రవరి మార్చి నెలల్లో కరోనా వస్తే ఏ మందులు వాడాలో సరిగా అవగాహన కలగలేదు. కానీ ఇటీవల పావిపిరావిర్, రెమ్‌డిస్‌విర్‌ మందులు వాడుతున్నారు. రోగులకు స్వస్థత చేకూరుతోంది. రోగులకు ఊపిరాడకపోతే అత్యవసరంగా బోర్లా పడుకోబెట్టి తలను ఓపక్క ఉంచితే ఉపశమనంగా ఉంటుందం టున్నారు. దీన్నే వైద్య పరిభాషలో ప్రోన్‌ పొజిషన్‌ అంటారు. ఇలా ప్రతి దశలోనూ సవాళ్లను ఎదుర్కొంటూ అటు బాధితులు ఇటు వైద్యులు నిరంతరం పోరాడుతునే ఉన్నారు. వ్యాక్సిన్‌ వీటన్నిటికీ చెక్‌ పెడుతుందన్న ఆశావహ ఆలోచనలు ప్రజల్లో ఉన్నప్పటికీ.. అది వచ్చే దాకా ఇలా పోరాడక తప్పదు.

Next Story