దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. క్షీణత మొదలైందా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Aug 2020 4:32 AM GMT
దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. క్షీణత మొదలైందా?

క్యాలెండర్ లో రోజు గడిచేసరికి.. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సరికొత్త రికార్డుగా నమోదు కావటం ఈ మధ్యన చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి గణాంకాల్నిక్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఓపక్క కేసులు పెరుగుతున్నా.. ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. ఇప్పుడు పెరుగుతున్న కేసుల సంఖ్యను లెక్కిస్తే.. ఒక శుభవార్త తెలుస్తుందని చెబుతున్నారు.

కేసులు పెరగటం.. శుభవార్త ఎందుకు అవుతుంది? మీకేమైందన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. కేసులు పెరుగుతున్నాయే తప్పించి.. పాజిటివ్ కేసుల పెరుగుద‌ల శాతంలో మాత్రం మార్పు వచ్చేసింది. ఇది శుభ సంకేతంగా పలువురు అభివర్ణిస్తున్నారు. మరింత అర్థమయ్యేలా చెప్పటంతే.. జులై 25 నాటికి దేశంలో రోజుకు కేసుల సంఖ్య 3.7 శాతానికి పెరిగేది. కట్ చేస్తే.. ఆగస్టు18 నాటికి చూస్తే.. అది కాస్తా 2.3 శాతానికి తగ్గటం గమనార్హం.

కరోనా తగ్గటానికి ఇదో చక్కటి అంశంగా చెబుతున్నారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టటానికి ఇదో కారణంగా మారితే.. మరణాల విషయంలోనూ మన దేశం ఇతర దేశాల కంటే తక్కువగా ఉందన్న విషయాన్ని చెప్పక తప్పదు. అంతర్జాతీయంగా కరోనా మరణాలు.. నమోదయ్యే కేసుల్లో 3.5 శాతం నుంచి నాలుగు శాతం వరకు ఉంటే.. మన దేశంలో మాత్రం 1.9 శాతానికే పరిమితమైంది.

అంటే.. నమోదయ్యే ప్రతి వంద కేసుల్లోనూ అంతర్జాతీయంగా నలుగురు వరకు మరణిస్తే.. మన దేశంలో మాత్రం ఇది 1.9 శాతానికే పరిమితమైంది. మరో ఊరటనిచ్చే అంశం ఏమంటే.. జులైలో 1.9 శాతంగా ఉన్న మరణాల రేటు.. తాజాగా 1.05 శాతానికి తగ్గినట్లుగా చెబుతున్నారు. ఈ సంకేతాల్ని చూస్తే.. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టిందని చెప్పక తప్పదు.

Next Story
Share it