కరోనాపై పోరు: కర్ఫ్యూలో 63వేల మంది పోలీసులు.. 11వేల హోంగార్డులు
By సుభాష్ Published on 22 March 2020 8:11 AM ISTప్రధాని నరేంద్రమోడీ పిలుపుతో జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రధాని పిలుపే లక్ష్యంగా దేశ ప్రజలంతా కర్ఫ్యూకు జై కొట్టారు. స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. ఈ జనతా కర్ఫ్యూ దేశ వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాటిస్తుండగా, తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల పాటు కర్ఫూలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.
అత్యవసర సేవలు అందించే సిబ్బందితో పాటు వైద్యులకు సంఘీభావంగా ప్రజలంతా సాయంత్రం 5 గంటలకు గడపదాటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని మోదీ, కేసీఆర్ సూచించారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 63వేల మంది పోలీసులు, 11 వేల మంది హోగార్డులు ఈ కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి జనతా కర్ఫ్యూ ప్రారంభమైంది. కర్ఫ్యూ సందర్భంగా హైదరాబాద్‌లో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. ఉదయం సమయంలో రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. ఎప్పుడు జనాలతో రద్దీగా కనిపించే రోడ్లు నిర్మానుషంగా మారాయి. ఇక బస్సులు, మెట్రో ట్రైన్స్ ఎక్కిడకక్కడ నిలిచిపోయాయి.
ఇక నగరంలో ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు వెలవెలవెలబోతున్నాయి. కర్ఫ్యూ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో మెడిక్ షాపులు, ఆస్పత్రులు, కూరగాయల షాపులు, పండ్ల షాపులు, పెట్రోల్ బంక్‌లకు మినహాయింపు ఇచ్చారు. అత్యవసర సమయాల్లో తప్ప ఇతర వాహనాలకు పెట్రోల్ పోయడం లేదు. ఇక అంబులెన్స్, ఫైర్ సర్వీసులు, విద్యుత్ సరఫరా, అత్యవసర సిబ్బంది యధావిధిగా పని చేస్తున్నారు. ప్రతి డిపోలో ఐదు బస్సులను సిద్దంగా ఉంచారు. ఏదైనా అత్యవసరం కోసం వాడుందుకే ఉపయోగిస్తున్నారు. అలాగే మెట్రో స్టేషన్‌లో కూడా ఐదు మెట్రో రైళ్లు సిద్ధంగా ఉన్నాయి.