తెలంగాణలో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్
By Newsmeter.Network Published on 26 March 2020 3:44 PM ISTతెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో ఇద్దరు వైద్యులు ఉండటం గమనార్హం. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 44కు చేరింది. కుత్బుల్లాపూర్‌కు చెందిన 49ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ మధ్య కాలంలోనే ఆయన ఢిల్లి వెళ్లి వచ్చారు. నగరంలోని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో నివాసముంటున్నారని తెలిపారు.
ఇదిలాఉంటే ఇద్దరు డాక్టర్లకు వైరస్ సోకడంతో ఆందోళన మరింత పెరుగుతుంది. ఇద్దరు వైద్యులు భార్యభర్తలు. ఈ ఇద్దరు వైద్యులు కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలోనే వారికి కూడా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ఇక వీరు దోమలగూడ ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఈ ప్రాంత వాసులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. వైద్యులను కలుసుకున్న వారిని, వైద్యులు కలిసిన వారిని వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు.
ఇదిలాఉంటే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మంగళవారానికి 39 ఉండగా, బుధవారం రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో 41కి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. కాగా గురువారం మూడు కేసులు నమోదు కావటంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరింది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే లాక్‌డౌన్‌తో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. పలువురు మాత్రం తమకు సంబంధం లేనట్లు రోడ్లపైకి వస్తున్నారు. ఇండ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావద్దని, నిర్లక్ష్యం వహించొద్దంటూ ప్రభుత్వం హెచ్చరించింది.