దేశ విదేశాల్లో తన కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌ ప్రముఖులకుసైతం హడల్‌ పుట్టిస్తోంది. ఆమెకు కరోనా పాజిటివ్‌ రిపోర్టు రావడంతో ఇన్నాళ్లు ఆమెను కలిసిన, ఆమె కలుసుకున్న ప్రముఖులు ఆందోళనకు గురవుతున్నారు. పలువురు ఎంపీలు సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలాఉంటే కనికా కపూర్‌కు షాకిస్తూ పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమెపై లక్నో మెడికల్‌ చీఫ్‌ ఫిర్యాదుతో ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కనికా మాత్రం  లండన్‌ నుంచి వచ్చాక ఎయిర్‌పోర్టులో తనకు అందరి మాదిరే పరీక్షలను నిర్వహించారని, అప్పుడు ఏమీ లేదని చెబుతుంది. నాలుగు రోజుల క్రితం ఫ్లూ లక్షణాలు కనపడంతో తనకు తాను పరీక్షలు చేయించుకున్నానని, పరీక్షల్లో కరోనా ఉన్నట్లు తేలిందని తెలిపింది. ప్రస్తుతం తాను, తన కుటుంబ సభ్యులు క్వారంటైన్‌లో ఉన్నామని కనికా పేర్కొంది. ఇది నేను తెలిసి చేసిన తప్పుకాదని కనికా తెలిపింది.

కనికా కపూర్‌ ఈనెల 9న బ్రిటన్‌ నుంచి ముంబయి చేరుకుంది. దీంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా లక్షణాలేవీ కనిపించలేదు. కాగా గత రెండు రోజుల క్రితం లఖ్‌నవూలో ఉండగా ఫ్లూ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చింది. ఈనెల 13 నుంచి 15 వరకు కనికా కపూర్‌ పలు పార్టీలు, కార్యక్రమాలకు హాజరైంది. ఆయా కార్యక్రమాలకు సుమారు 300 మంది చొప్పున హాజరై ఉండవచ్చునని తెలుస్తోంది. ఇదిలాఉంటే లఖ్‌నవూలో కనిక హాజరయిన విందుకు రాజస్థాన్‌ మాజీ సీఎం వసుందర రాజే, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్‌ వెళ్లారు. ఇప్పుడు కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వసుంధర్‌ రాజే, దుష్యంత్‌ సింగ్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తుంది.

మరింత ఆందోళనకు గురిచేసే విషయం ఏమిటంటే.. ఎంపీ దుష్యంత్‌ కనికా ఇచ్చిన పార్టీ నుంచి నేరుగా పార్లమెంట్‌కు హాజరయ్యారు. దాదాపు అక్కడే రెండుగంటలపాటు గడిపారు. పార్లమెంట్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌, ఎంపీ అనుప్రియా పటేల్‌తో సన్నిహితంగా మెలిగారు. దీంతో వారిరువురు కూడా సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదిలాఉంటే కనికా కంపూర్‌ ఎఫెక్ట్ రాష్ట్రపతికికూడా తాకినట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కనికా ఇచ్చిన విందుకు హాజరైన దుష్యంత్‌ కూడా హాజరయ్యారు. దుష్యంత్‌ రాష్ట్రపతి కోవింద్‌ను కలిశారు. ఆయనతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ కూడా కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కరోనా పరీక్షల్లో ఫలితాలు వచ్చేవరకు అపాయింట్‌మెంట్స్‌, షెడ్యూల్స్‌ రద్దయ్యాయి.

ఇదిలా ఉంటే కనికా ఎవరెవరిని కలిశారో వారి లిస్ట్ ను అధికారులు రెడీ చేశారు. వారందరినీ క్వారంటైన్‌ విధించుకునేలా అధికారులు సూచించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి కనికా కంపూర్‌కు కరోనా పాజిటివ్‌ రావడం ఆమెతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖుల్లో టెన్షన్‌ మొదలైంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.