కేసులే కేసులు.. చాలా రాష్ట్రాల్లో కమ్యూనిటీ స్ప్రెడ్‌

By మధుసూదనరావు రామదుర్గం  Published on  8 Aug 2020 11:04 AM GMT
కేసులే కేసులు.. చాలా రాష్ట్రాల్లో కమ్యూనిటీ స్ప్రెడ్‌

కరోనా విలయతాండవం అంతకంతకూ పెరిగిపోతుండటంతో దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరవడమే కాకుండా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా దేశంలో ఒక్కరోజుకే 60 వేల మందికి పైగా పాజిటివ్‌గా తేలారు. ఒక్కరోజే ఇంతమందికి వైరస్‌ సోకడం ఇదే తొలిసారి. వివిధ రాష్ట్రాల్లో కమ్యూనిటీ వ్యాప్తి పెరిగిందని దీన్న బట్టి తెలుస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 20 లక్షల పై మాటే. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు రాకెట్లా పైకి దూసుకెళుతున్నాయి. మహారాష్ట్రలో వారంలో రెండోసారి ఒక రోజులో 11వేలమందికి కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ సంఖ్య హెచ్చుగానే ఉంటోంది. మరణాల సంఖ్య కూడా నిరుటి కంటే ఎక్కువగానే ఉంటున్నాయి.

మొదట్లో కరోనా పాజిటివ్‌ సంఖ్య పెరిగినా.. మరణం శాతం తక్కువే కదా అనుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆ సంఖ్య కూడా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఒక్క రోజులో దాదాపు 900 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50వేల మంది కోలుకున్నారు కూడా. గత నెల ఆఖరులో మనదేశంలో కరోనా బాధితుల సంఖ్య 15 లక్షలదాకా ఉంటే.. కేవలం 9 రోజుల్లోనే 5 లక్షల దాకా చేరుకుందంటే ఎంత వేగంగా వైరస్‌ చలరేగుతోందో తెలుస్తుంది.

ఇదే సమయంలో బ్రెజిల్‌లో 3.82 లక్షలు, అమెరికాలో 5 లక్షల కేసులు పెరిగాయి. ఈ ఉధృతి ప్రపంచవ్యాప్తంగా ఉంది మనదేశంలోనే కాదుగా అనుకున్నా.. ఎక్కడ కరోనా చలరేగినా బాధపడాల్సింది సోకినవారు.. వారితోపాటు ఉంటున్నవారేగా!

సంఖ్య చూస్తేనే హడల్‌..

మొన్నటికి మొన్న ఢిల్లీలో కేసులు తగ్గుముఖం పట్టాయని పరిశీలకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మళ్ళీ అక్కడ కూడా కరోనా తన తడాఖా చూపిస్తోంది. పైగా కోలుకున్నవారి కంటే వచ్చిన వారి సంఖ్యే హెచ్చుగా ఉండటం మరింత ఆందోళన కలిగించే విషయం. నాగాలాండ్, లద్దఖ్, చండీగఢ్‌ తదితర ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 316 మరణాలు, తమిళనాడులో 110 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం టాప్‌ 5లో మహారాష్ట్ర , తమిళనాడు టాప్‌ 10లోని ఢిల్లీ ,గుజరాత్, తెలంగాణలో కేసులు జాతీయ సగటు కంటే తక్కువగానే ఉంటున్నాయి.

రోడ్లపై జనాలే జనాలు..

ఒకపక్క దేశంలో కేసులు పెరిగిపోతున్నాయని హడలెత్తిపోతుంటే.. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో జనసంచారం చూస్తుంటే అసలు కరోనా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖానికి మాస్క్‌ పెట్టుకోకుండా బిందాస్‌గా తిరుగుతున్న కొందరు ఈ వైరస్‌ తీవ్రత అర్థం కాకుండా లైట్‌ తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ పెడితే తప్ప, పోలీసులు లాఠీలు ఝళిపిస్తే తప్ప భయపడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారేమో.

మీడియాలో రోజూ వస్తున్న కరోనా కకావికల సంఘటనలు ఈ తరహా మనుషులను అణువంత కూడా కదలించడం లేదు. ఏదో ప్రజలు ధైర్యం కోల్పోరాదని కొందరు డాక్టర్లు ఈ కరోనా ఏంచేస్తుందిలే అంటే.. దాన్నే పట్టుకుని ఆ ఏం చేస్తుంది అంటూ రెచ్చిపోతున్నారు కొందరు. మార్కెట్లలో, షాపుల్లో ఏమాత్రం భౌతికదూరం పాటించడం లేదు.

తిరుపతిలో కరోనా కేసులు పెరగడంతో నియమిత వేళల్లోనే బైటికి రావాలని నిబంధన విధించారు. హైదరాబాద్‌లో కంటైన్‌మెంట్‌ కాలనీలు ఉన్నా రాకపోకలు సాగుతునే ఉన్నాయి. పోలీసులు కట్టడి చేయడం కాదు ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలి. ప్రాణాలు పోతాయన్నా.. పోతున్నా పట్టించుకోకుంటే ఎలా అని డాక్టర్లు, పోలీసు అధికారులు అంటున్నారు.

వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందో..

మాఘమాసం ఎప్పుడొస్తుందో అన్నట్టు కరోనాకు వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందో అని ప్రపంచ ప్రజలు ఆతురతతో ఎదురుచూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నవంబర్‌ నాటికి వ్యాక్సిన్‌ ఖాయం అని ఊరిస్తున్నాడు. ఇది కేవలం రానున్న ఎన్నికల కోసమే అని అక్కడి ప్రతిపక్షలు విమర్శిస్తున్నాయి. సిరమ్‌ కంపెనీ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించింది. అది కూడా రేపో మాపో మార్కెట్లో విడుదల చేస్తాం అంటోంది.

మరోపక్క కరోనా పీక్‌కు వెళ్ళిపోతోంది కాబట్టి త్వరలో కర్వ్‌ ఫ్లాట్‌ కావడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సరే వ్యాక్సిన్‌ ఎప్పుడు రావాలో అప్పడొస్తుంది. కానీ ఈలోగా జరిగే ప్రాణనష్టం గురించి కూడా ఆలోచించాలిగా! అందుకే కరోనా తగ్గేదాకా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటంచడం, శుచిశుభ్రతకు పెద్దపీట వేయడం మన జీవనవిధానంలో భాగమైపోవాలి. తప్పదు!!

Next Story
Share it