అతి జాగ్రత్త, అతిభయం రెండూ ప్రమాదమే.!
By మధుసూదనరావు రామదుర్గం Published on 2 Aug 2020 9:36 PM ISTప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా బాధితుల సంఖ్య కాస్త తక్కువే. అంతే కాదు ఈ వైరస్‌తో పోరాడి కోలుకున్న వారి సంఖ్య గణనీయంగానే కనిపిస్తోంది. మృతుల సంఖ్య తక్కువనే చెప్పొచ్చు. ఈ మాటలు వినడానికి బాగానే ఉన్నా.. కరోనాను మనం తక్కువ అంచనా వేస్తే అది మనల్ని కమ్మేస్తుంది. కేసులు పరిశీలిస్తే మొదటి కంటే విజృంభణగా ఉంటున్నా.. జనాల్లో మొదట్లో ఉన్నంత భయం కంగారు కాస్త తగ్గిన మాట వాస్తవం. అయిదో నెల గడుస్తున్నా ఇంకా ఇంటిపట్టునే ఉండటమంటే ఆర్థికంగా సమస్యే! ఉన్నత కొలువుల్లో ఉన్నవారు ఇంటి నుంచి పని చేసే ఐటీ వారి సంగతి పక్కన పెడితే పేదలు దిగువ మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి అంతకంతకు సంక్లిష్టంగా మారుతోంది. ఉపాధి కోసం నగరానికి వలస వచ్చిన పేద పల్లెవాసులు నానా కష్టపడి తమ ఊళ్లకు వెళ్ళారే గానీ అక్కడ పని దొరకడం కూడా అంత సులువేం కాదని ఈపాటికే అర్థమై ఉంటుంది. వారు కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ మళ్ళీ పరిస్థితి మామూలుగా ఎప్పుడు మారుతుందా అని రోజులు కాదు గంటలు లెక్కబెట్టుకునే దుస్థితి.
ఈ పరిస్థితి ఒక కోణం అనుకుంటే.. మరోకోణంలో నగరం, పట్టణాల్లో కరోనా సోకిన వారు భయంతోనో మరేతర కారణాల వల్లనో బైటికి ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. వైరస్ సోకిన పది రోజులు తర్వాత పరిస్థితి విషమంగా మారిన తర్వాత డాక్టర్ వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. కరోనా తొలి దశ చాలా సాధారణంగా ఉంటుంది. అయితే వైరస్ ఓ సారి లోపల కుదురుకున్నాక దాని విజృంభణ మొదలవుతుందన్నది మనం విస్మరించరాదు. డాక్టర్లు పదే పదే చెబుతున్నది కూడా ఇదే! మనం ఉపేక్షిస్తే...ఉదాసీనంగా వ్యవహరిస్తే అది ఉపద్రవంగా మారుతుంది. ఈ మధ్యన మనం కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమనిపిస్తుంది. కరోనా వైరస్ మన ఊపిరి తిత్తుల మీద, గుండెమీద దాడి చేస్తుందని చాలా మందికి తెలుసు. అయితే ఈ వైరస్ మరింత హాని కలిగించే అంశం...రక్తం గడ్డకట్టేలా చేయడం. ఇది ఎంత ప్రమాదమంటే బాధితులు తెలుసుకునేలోగా ప్రాణానికి ముప్పుగా మారిపోతుంది. ముఖ్యంగా వయసులో ఉన్న వాళ్ళు ఇలాంటి విషమ పరిస్థితికి బలవుతుండటం నిజంగా శోచనీయం.
కరోనా వైరస్ శ్వాస వ్యవస్థ ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే డాక్టర్లు మీడియాలోనూ ముక్కు, నోరు కప్పేలా మాస్క్ తప్పని సరి అని పదే పదే హెచ్చరించేది. మొదట్లో ఈ వైరస్ శ్వాసవ్యవస్థను దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు భావించారు. అందుకు తగినట్టుగానే కరోనా మొదటి లక్షణం దగ్గు జలుబు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా గుర్తించారు. అయితే రాను రానూ ఈ వైరస్ తన ఆకృతి మార్చుకుని అనూహ్యంగా దుష్ఫలితాలిచ్చే మహమ్మారి అని అనుభవం ద్వారా తెలుస్తోంది. అందుకే కరోనా రెండో దశ దాటిన వారిలో కొందరు ఉన్నట్టుండి ప్రమాదకర స్థితికి చేరుకుంటున్నారు. అంటే వారిలో బ్లడ్ క్లాట్ లాంటివి ఉండవచ్చని వైద్యుల ఆలోచన. అయితే అందరిలో ఇదే పరిస్థితి తలెత్తదు. సాధారణంగా 85శాతం మంది కరోనాతో వారికి తెలీకుండానే పోరాడి విజేతలవుతున్నారు. అంటే వారి శరీరంలోని రోగనిరోధక శక్తి బాగానే ఉందని అర్థం. వారిలో 15 రోజులకే యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయి. కేవలం ఒకటి నుంచి రెండు శాతం వారికి మాత్రమే రోగలక్షణాలు తీవ్రంగా కనిపించి ఐసీయూ దాకా తీసుకెళతాయి. అంటే వారిలో ఇదివరకే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని డాక్టర్లు అంటున్నారు. అందుకే బీపీ,మధుమేహం, గుండె,మూత్రపిండాలు తదితర సమస్యలున్నవారు చాలా జాగ్రత్తగా ఉండితీరాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సహజంగానే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వీలుంది.
కరోనా సోకిన కొందరు అందులోనూ యువకులు మధ్య వయసు వారు ఉన్నట్టుండి కుప్పకూలిపోతుండటం మొదట్లో వైద్యులకే అంతుబట్టకున్నా.. శరీరంలోని రక్తం గడ్డకట్టడం, గుండె నాళాలు వాపు రావడం తదితర అంశాలు బాధితుల స్థితిని క్రిటికల్‌గా మారుస్తున్నా యని కొందరి భావన. వైరస్ ఒకసారి శరీరంలోకి వచ్చాక తీవ్రతను బట్టి పెద్దసంఖ్యలో సైటోకైన్స్ ఉత్పత్తి అవుతాయి. దీనికారణంగానో మరేతర కారణాల వల్లనో రక్తనాళాల్లోని మృదువైన ఎండోరీలియంపై దుష్ప్రభావం చూపుతుందని వైద్యులంటున్నారు. రక్తం గడ్డకట్టకుండా అడ్డుకునే రసాయనాలు ఈ ఎండోరియం కణంలో ఉంటాయి. వైరస్ ఈ కణాలను దెబ్బతీయడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదముందని డాక్టర్ల వాదన. ఈ సమస్యను సకాలంలో గుర్తించగలిగితే సరైన చికిత్స అందించే వీలుంది. కానీ వివిధ కారణాల వల్ల బాధితులు ఆలస్యంగా డాక్టర్ల వద్దకు వస్తున్నారు. కేవలం వారికి తెలీకపోవడమే కాదు...తీవ్రత తెలిసిన వెంటనే పరుగులు తీద్దామన్నా ఆస్పత్రుల్లో ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు లేవని , కరోనా చికిత్స లేదని చెప్పడంతో సరైనా డాక్టర్లను వెదకడంలోనే సమయం మించిపోతోంది.
ఈ కరోనా వైరస్‌కు సంబంధించి అతిముఖ్యమై విషయం.. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిని త్వరగా పసిగట్టడం. అందుకే వైద్యులు పల్స్ ఆక్సీమీటర్ ద్వారా రక్తంలో ఆక్సిజన్ ఎంతుందో నిరంతరం తెలుసుకుంటుండాలి. ప్రస్తుతం మెడికల్ షాపుల్లో ఆక్సీమీటర్ లభిస్తోంది. రక్తంలో ఆక్సిజెన్ 94శాతం కంటే తగ్గితే వెంటనే అప్రమత్తం కావాలి. నాడీవేగం 120 కంటే పెరిగినా అనుమానించాలి. అలాగే అకస్మాత్తుగా ఛాతీ పట్టేసినట్టనిపించినా, ఆయాసం,దగ్గు ఎక్కువ కావడం, కాళ్ళవాపులు ఇవన్నీ మనల్ని హెచ్చరించే సూచనలని గమనించాలి. అసిడిటీ వల్ల కూడా ఛాతీ పట్టేసినట్టనిపించడం సాధారణం. కానీ వైరస్ బారిన పడినవారు మాత్రం ఒకటికి నాలుగురకాలుగా ఆలోచించి వీలైనంత త్వరగా డాక్టర్లను సంప్రదించాలని వైద్యనిపుణులు సలహాలిస్తున్నారు.
సరైన సమయంలో సరైన జాగ్రత్తే కరోనా నివారణకు అసలైన మందు. అతిగా భయపడటమే కాదు ఏమీ కాదని అతివిశ్వాసంతో తిరగడం కూడా ప్రమాదమే. ముందస్తు జాగ్రత్తగా సరైన ఆహారం తీసుకోవడం, అవసరముంటే తప్ప బైటికి వెళ్ళకపోవడంతో పాటు...మాస్కులు తప్పనిసరిగా ధరించడం, భౌతికదూరం పాటించడం అత్యవసరమని అందరూ అనుకోవాలి. ఈ మహమ్మారి ఎప్పుడు వదలిపోతుందో.. ఈ తీవ్రత ఎప్పుడు చల్లబడుతుందో.. వ్యాక్సిన్లు ఎప్పుడు మనకు అందుబాటులో వస్తాయో.. ఈ సమస్యలకు సమాధానాలు లభించడం కష్టం కాబట్టి ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. కరోనా ఏం చేస్తుంది అనుకుంటే మొదటికే మోసం ఖాయం!!