కరోనాని అరికట్టాలంటే మాస్క్ లను ఇలా ఉపయోగించాలి!!
By న్యూస్‌మీటర్ తెలుగు
ఈ రోజుల్లో ఎవరిని చూసినా ముఖానికి మాస్కులు ధరిస్తున్నారు. అమ్మాయిలైతే తలకు స్కార్ఫ్ చుట్టుకుని, ముఖమంతా కప్పుకుని, దాని పైన మాస్క్ వేసుకుని డబుల్ ప్రొటెక్షన్ పొందుతున్నారు. కరోనా కాటు నుంచి వైరస్ వేటు నుంచి తప్పించుకునేందుకు వారు ఈ కామర్స్ ద్వారా, ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారా, దుకాణాల నుంచి మాస్కులు కొనేస్తున్నారు.
ఇంతకీ మాస్క్ ఎలా ఉండాలి? మంచి మాస్క్ ని ఎలా గుర్తించాలి? అసలు మాస్కులు వేసుకోవడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి?
మాస్కులు ముఖ్యంగా నోటిలోని, గొంతులోని మ్యూకస్ పొరకు వైరస్ ఇన్ ఫెక్షన్ రాకుండా చూడాలి. ఎందుకంటే వైరల్ ఇన్ ఫెక్షన్లన్నీ మ్యూకస్ మెంబ్రేన్ లేదా పొర నుంచే మొదలవుతాయి. అక్కడ నుంచి నెమ్మదిగా శ్వాస నాళికలోకి, తద్వారా ఊపిరితిత్తుల దాకా వెళ్తుంది. అందుకే రెండు తరహాల మాస్కులు మంచివి. ఆ రెండు తరహాల్లో ఏదో ఒకటి కొనుక్కుంటే మంచిది. మొదటిది ఎన్ 99. ఇది 99.9 శాతం కాలుష్యకారకాలను నిరోధించగలుగుతుంది. వైరస్ దాడిని ఆపగలుగుతుంది. రెండో తరహా మాస్క్ మూడు పొరల మాస్క్. ఇది మూడు పొరలుగా ఉంటుంది. ఒక పొరనుంచి రోగకారకాలు దాటి రాగలిగినా రెండో పొర వాటిని నిరోధిస్తుంది. అదనపు రక్షణగా మూడో పొర పనిచేస్తుంది. కాబట్టి ఇది చాలా సేఫ్.
మాస్క్ ను ధరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి
- చేతులు శుభ్రం చేసుకోవాలిః మాస్కులు ధరించే ముందు చేతులను ఆల్కహాల్ బేస్ ఉన్న హాండ్ రబ్ లేదా సానిటైజర్ ను తప్పక వాడాలి. దానితో చేతులను బాగా రుద్దుకోవాలి. ఇవి బాక్టీరియాను చంపేస్తుంది. బజార్లో రకరకాల సానిటైజర్లు అందుబాటులో ఉన్నాయి.
- ముక్కు, నోరుకు రక్షణః మాస్క్ ను ముఖానికి, ముక్కును బాగా కవర్ చేసేలా ధరించాలి. మాస్కుకు, ముక్కు, నోరుకి మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలి. దీని వల్ల మాస్క్, ముక్కు , నోరుల మధ్య ఖాళీ స్థలంలో రోగకారకాలు లేకుండా చూసుకోవాలి.
- పదేపదే మాస్క్ ను తాకకండిః మాస్క్ ను ధరించిన తరువాత పదేపదే దానిని చేతులతో తాకడం, సర్దడం, చేతిని రుద్దడం వంటివి చేయకూడదు. ఇవి ఇన్ ఫెక్షన్ కు దారి తీస్తాయి. అలా తాకాల్సి వస్తే తప్పనిసరిగా హాండ్ రబ్ ను ఉపయోగించాలి. దానితో చేతులను శుభ్రం చేసుకోవాలి.
- మాస్క్ తడిస్తేః మాస్క్ పదేపదేవాడటం ద్వారా అది ఊపిరి వల్ల, మంచు వల్ల తడిసిపోతుంది. అలా తడిసి మెత్తబడిన మాస్కులను ధరించకండి. కొత్తది వాడటం మంచిది. అలాగే ఒకేసారి వాడి పారేసే మాస్కులను పదేపదే వాడకండి. వీటిని సింగిల్ యూస్ మాస్క్ అంటారు. ఇవి ఒకసారే వాడాలి.
- మాస్కులను తీసేయడం ఎలా? మాస్కులను తీసేటప్పుడు ముందు నుంచి అంటే ముక్కు భాగం నుంచి తీసేయకూడాదు. చెవి వెనక నుంచి తీయాలి. తీసిన వెనువెంటనే మాస్కును మూత ఉన్న చెత్త కుండీలో పారేసి, కుండీకి మళ్లీ మూత బిగించేయాలి. వీలైనంత త్వరగా చేతులను డెట్టాల్ లేదా సానిటైజర్ తో కడిగి వేయాలి.