సీఎం నివాస ప్రాంతంలో వ్యక్తికి కరోనా.. భద్రతా సిబ్బంది క్వారంటైన్‌కి..

By Newsmeter.Network  Published on  7 April 2020 10:51 AM GMT
సీఎం నివాస ప్రాంతంలో వ్యక్తికి కరోనా.. భద్రతా సిబ్బంది క్వారంటైన్‌కి..

భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతుంది. ఈ వైరస్‌ భారిన పడి అనేక మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఎప్పుడు ఎవరికి ఈ వైరస్‌ సోకుతుందో అర్థంకాని పరిస్థితి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే నివాసముండే ప్రాంతంలో ఓ దుకాణం యాజమానికి కరోనా వైరస్‌ సోకింది. అధికారులు నిర్ధారించి అతన్ని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. సీఎం నివాసముండే మాతోశ్రీ సమీపంలోనే ఈ దుకాణం ఉండటం, సీఎం భద్రతా సిబ్బంది పలువురు పలుసార్లు అక్కడి వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆయన భద్రతా సిబ్బందిలోని దాదాపు 170 మందిని ఆ ప్రాంతం నుంచి తరలించారు.

Also Read :నా భర్త లాక్‌డౌన్‌ పాటించడం లేదు.. చర్యలు తీసుకోండి..!

వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా.. ముందస్తుగా అధికారులు అప్రత్తమై వారిని క్వారంటైన్‌లోకి పంపించి వేశారు. దీనిపై వెంటనే అప్రమత్తమైన ముంబయి మున్సిపల్‌ విభాగం ఆ ప్రాంతంలో పూర్తిగా క్రిమిసంహారిణి చల్లించి శుభ్రం చేయించింది. ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుండి సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సిబ్బంది నుంచి సామాజిక దూరం పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చాలా వరకు కారును స్వయంగా ఆయనే నడుపుకుంటున్నారని, అయినా సిబ్బందిలో ఎవరైనా ఏదైనా సమయంలో సీఎంకు దగ్గరగా వెళ్లారేమో పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే సీఎం దగ్గర ఉండే భద్రతా సిబ్బంది నమూనాల్ని సేకరించి వైద్య పరీక్షలకు పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Next Story