ధైర్యమే రక్షణ కవచం..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 20 July 2020 2:48 PM ISTఎవరైనా దగ్గితే ఉలిక్కి పడుతున్నాం.. తుమ్మితే ద్యేవుడా అని వెన్నుతట్టుకుంటున్నాం. గత నాలుగు నెలలుగా ఇదే తీరు. కరోనా పడగ విప్పిన దరిమిలా సాటి మనిషిని నమ్మాలంటేనే భయమేసే పరిస్థితి. వీటికి తోడు పొరపాటున కరోనా వచ్చిందని ప్రకటిస్తే మరు క్షణం నుంచే అంటరానివారిగా చూస్తున్నారు. పెద్ద పెద్ద సిటీల్లో కరోనా హెచ్చుగా ఉండటంతో ఉపాధి కోసం వలస వచ్చిన వారు తిరిగి సొంతూరికి మూటాముల్లె సర్దుకుని కాలినడకన వెళ్లిపోయారు. ఈ ధశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు విరుచుకు పడ్డారు. వెంటనే మేల్కొన్న ప్రభుత్వాలు శ్రామిక్ రైల్, లారీలు, ట్రక్కులు, బస్సులు ఏర్పాటు చేశాయి. ఇక సిటీల్లో అపార్ట్ మెంట్లలో ఉండేవారి పరిస్థితి మరీ ఘోరం. ఏమాత్రం పాజిటవ్ అని తెలిసినా మరు క్షణం నుంచి దూరం ఉంచేస్తున్నారు. ఈ పరిణామాలకు మానసికంగా విపరీతంగా ఆందోళనకు గురైన ప్రజలు కరోనా వచ్చినా పరీక్షలు చేయించుకోడానికి వెనకంజ వేశారు. ఎక్కడ కరోనా కాటేస్తుందోనని ప్రతి ఒక్కరు కుమిలి పోయారు.
ఈ నేపథ్యంలో డాక్టర్లు, మానసిక శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తూ ధైర్యమే అందరికీ రక్ష అని చెబుతున్నారు. ఈ విపత్కాలంలో మానసికంగా ఆందోళన చెందకుండా ఉండటం కూడా కీలకమే. కరోనా వచ్చిందనో...వస్తుందనో ఆస్పత్రులకు చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదని వైద్యులు అంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురై.. జ్వరం, దగ్గు వస్తూ.. వంట్లో నీరసంగా ఉంటే డాక్టర్లను సంప్రదించండని చెబుతున్నారు. సరైన పోషక ఆహారం.. నిరంతరం జాగ్రత్త.. రోజుకు శరీరానికి కావల్సినంత నీళ్లు తీసుకుంటూ శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోగలిగితే ఈ ప్రమాదం నుంచి సగం బైట పడ్డట్టే. అసలు కరోనా అనేది ఒక మాయదారి వైరస్. దీని జీవితకాలం మహా అంటే ఓ వారం లేదా రెండు వారాలే. ఆ తర్వాత అది తోకముడిచేసి మాయమై పోతుంది. ఈ మాత్రం దానికే భయపడటం మనలోని పిరికితనానికి నిదర్శనం.
కరోనా పీడితులు ఇలా..
కరోనా రకరకాల విన్యాసాలు చేస్తోంది. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు. అసలు కరోనా లక్షణాలను ఇలా వర్గీకరించవచ్చు. 1.లక్షణాలే లేని వారు (ఎసింప్టమేటిక్) 2. స్వల్పపాటి లక్షణాలున్నవారు (మైల్డ్) 3.మధ్యరకం వాళ్లు (మోడరేట్) 4. తీవ్రలక్షణాలున్నవారు (సివియర్) 5. విషమంగా ఉన్నవారు ( క్రిటికల్).. ఈ జాబితాలో చివరి మూడు కేటగిరీకి చెందిన వ్యక్తులు ఎలాగూ ఆస్పత్రిలో చేరక తప్పదు. తర్వాతి రెండు రకాల వారు హోం ఐసోలేషన్ తోపాటు తగిన జాగ్రత్తలతో చిన్నపాటి చికిత్స చేయించుకుంటే చాలు.
లక్షణాలు లేకున్న పరీక్షలా..
కొందరికి కరోనా లక్షణాలే ఉండవు మామూలు జలుబులా ఉంటుంది. ఈ కరోనా రాకుండా ఉంటే వారు కూడా దీన్ని లెక్కచేయకుండా చిన్నపాటి జాగ్రత్తలు పాటించేసి పదా అనుకునే వారు. కానీ విపరీతంగా కరోనా వార్తలు వినడం వల్ల, చుట్టుపక్కల సంఘటనలను మనసుకు గాఢంగా తీసుకోవడం వల్ల అనుమానాలు వెల్లువెత్తుతుంటాయి. వీరు కేవలం అనుమానం ఆందోళనతో ఆస్పత్రికి పరిగెత్తి టెస్టింగ్ కోసం క్యూ కడుతున్నారు. అపార్ట్ మెంట్లో ఒకరి వచ్చిందంటా అక్కడున్న వారందరూ పరుగులు తీస్తున్నారు. ఇలాంటి వారు అనవసరంగా ఆపసోపలు పడకుండా కాస్త నెమ్మదించి ఆలోచించడం ఉత్తమం. లేకుంటే అనవసరంగా ఆస్పత్రుల వద్ద పరీక్షకేంద్రాల వద్ద రద్దీ పెరిగిపోతుండటంతో నిజమైన బాధితులకు చికిత్స అందడం కష్టమై పోతోంది. జలుబు, గొంతునొప్పి, జ్వరం ఉంటే.. శ్వాసకోశలో ఇన్‌ఫెక్షన్ ఉంటే, లక్షణాలు కనిపించకపోయినా అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల వ్యాధి తదితర దీర్ఘకాలిక సమస్యలున్నవారు ఉపేక్షించక కరోనా టెస్టింగ్ చేయించుకోవాలి.
కరోనా ఇలా వస్తుంది..
కరోనా వైరస్ సాధారణంగా శ్వాస వ్యవస్థలో ప్రవేశించి, తేలికపాటి గొంతునొప్పి నుంచి జ్వరం వంటి సమస్యలకు కారణమవుతుంది. వాస్తవానికి చాలా మందిలో కరోనా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. కొంతమందిలో మాత్రమే నిమోనియాకు దారితీస్తుంది. చాలా తక్కువ కేసుల్లో వైరస్ వెళ్లినా శరీరంలో వాపు మొదలవుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తి అతిగా స్పందించి సైటోకైన్స్ యాసిడ్లను విడుదల చేస్తుంది. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదముంది. అయితే ఇది చాలా రేర్ కేసుల్లోనే ఉంటుంది.
ఐసోలేషన్ ఆసామాషీ కాదు..
కరోనా లక్షణాలున్నా, పాజిటివ్ గా నిర్ధారణ అయినా కంగారు పడకుండా ఈ విధానాలు అనుసరిస్తే సరిపోతుంది. ఒంటరిగా ఉండటం, భౌతికంగా దూరం పాటిస్తుండటం ఈ వ్యాధి నిరోధానికి తీసుకోవాల్సిన అతి ముఖ్య జాగ్రత్తలు. విధిగా స్ట్రిక్ట్ ఐసోలేషన్ అవసరం. గది గడప దాటరాదు. వీలైతే అటాచ్ బాత్ రూం ఉన్న గదిలో ఉండటం శ్రేయస్కరం. అలాగే ఆ సమయంలో ఆందోళన కలిగించే ఏ విషయాలు వినరాదు, చూడరాదు, మనసులో తలచరాదు. సాధ్యమైనంత కూల్ గా ఉండేందుకు ప్రయత్నించాలి. కరోనా వార్తలు టీవీల్లో ఫోన్లలో చూడటం వదిలేయాలి. నచ్చినవారితో వీలైతే వీడియోలో మాట్లాడాలి. ఇలా చేస్తే ఒంటరితనం అన్న భావన తగ్గుతుంది. జలుబు,దగ్గు, గొంతునొప్పి లక్షణాలుంటే క్రమం తప్పకుండా రోజూ ఆవిరి పట్టాలి. రోగనిరోధకశక్తి (ఇమ్యూనిటీ) పెంచే ఆహారాన్నే తీసుకోవాలి. పారాసిటమాల్ 650 ఎం.జి. రోజుకు 4నుంచి సార్లు డాక్టరు సూచన మేరకు తీసుకోవాలి. అజిత్రోమైసిన్ లాంటి యాంటీ బయాటిక్స్ వాడాల్సి వస్తుందేమో డాక్టర్ ని అడగాలి. అలాగే విటమిన్ సి, విటమిన్ డి మాత్రలు తీసుకోవాలి.
ఆందోళన కలిగిస్తున్న అంకెలు..
లాక్ డౌన్ సడలించిన తర్వాత దేశంలో కరోనా కేసులు రెచ్చిపోతున్నాయి. అమెరికాలో 38లక్షలా 65 వేలు పైచిలుకు కేసులు నమోదైతే మరణాలు లక్షన్నర. మన దేశంలో 11 లక్షల దిశగా సంఖ్యలు అంతకంతకు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో మూడులక్షలు, తమిళనాడు దగ్గరదగ్గర రెండులక్షలు, ఏపీలో 50వేలకు చేరువలో, తెలంగాణలో 45వేల మందికి కరోనా సోకింది. గుడ్డిలో మెల్ల అన్నట్టు మనదేశంలో రికవరీ శాతం అధికంగా ఉండటంతో పాటు మరణాల సంఖ్య తక్కువగా ఉండటం కాసింత ఊరట.
కరోనా వచ్చిందని ఇప్పుడు కకావికలమైపోతున్నాం. ఇది కొన్ని నెలలకైనా వెళ్లిపోక తప్పదు. ప్రపంచ దేశాల్లో శాస్త్రవేత్తలు వాక్సిన్ కనుక్కోడానికి విశ్వప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. వారి శ్రమ ఫలించే సమయం కూడా వచ్చేస్తోంది. ఈ కష్టం కలకాలం ఉండదు. కాకపోతే ఈ కరోనా మనకు చాలా జీవితపాఠాలు నేర్పుతోంది. రాగద్వేషాలు, ఈర్ష్యాసూయాలు, కక్షలు కార్పణ్యాలు ఈ పాటి చిన్నజీవితానికి అవసరమా అని నిలదీసింది. మనమేంటో మనమెంత సున్నితమైన జీవితంలో ఉంటున్నామో విడమరచి వివరించింది. అనవసర విషయాలతో జీవితాన్ని నిరర్థకం చేసుకోకుండా బంధాలు అనుబంధాలను కాపాడుకుంటూ చక్కగా జీవించాలని బోధిస్తోంది. వాయు కాలుష్యం, పరిసరాల కాలుష్యం అన్నిటికీ మనమే కారణమని తెలిపింది. తప్పు అని తెలిశాక సరిదిద్దుకోవడం ఎంతసేపు.. కాబట్టి ధైర్యం సేయరా డింభకా అని మనసుకు చెప్పుకుంటూ మున్ముందుకు సాగిపోవడమే మనముందున్న కర్తవ్యం. అంతేగా అంతేగా..