అందుకే లాక్‌డౌన్‌ను పొడిగించాం: సీఎం కేసీఆర్
By సుభాష్ Published on 13 April 2020 7:30 AM ISTదేశ వ్యాప్తంగా కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులతో కరోనాపై సమీక్ష నిర్వహించారు. ఆదివారం కొత్తగా 28మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 531కి చేరగా, 16 మంది మృతి చెందినట్లు చెప్పారు. ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన సమీక్షలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలు తీరు, పేదలకు అందుతున్న సాయం, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షించారు.
కరోనా మహారాష్ట్రలో అధికంగా ఉన్న నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగించాల్సి వచ్చిందని, అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని, అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా లాక్‌డౌన్ పొడిగించామన్నారు. తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే కరోనా ఏ మాత్రం ఆగట్లేదని స్పష్టమవుతోందని, ప్రజలంతా సహకరించి ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. కొన్ని రోజులు ఓపికగా ఉంటే మనం గట్టెక్కవచ్చని అన్నారు. ఇబ్బంది అయినా ఇళ్లకే పరిమితం కావాలని, లేకపపోతే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని అన్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ విధంగా ఉందని, లేకపోతే మరో అమెరికా అయ్యేదని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 900 మందికి కరోనా పాజిటివ్ రావడంపై మరింత ఆందోళన కలిగిస్తోంది.