కరోనా సెలవులు మాకు వర్తించవు.. ప్రభుత్వం చెబితే నేను వినాలా.?
By అంజి Published on 18 March 2020 10:28 AM ISTజోగులాంబ గద్వాల: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31వరకు సెలవులు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఆ సెలవులు మాకు వర్తించవని అయిజా పట్టణంలోని వివేక్ గురుకుల కోచింగ్ సెంటర్ యాజమాన్యం చెబుతోంది.
'ప్రభుత్వం చెబితే నేను వినాలా.? వినను ఎవరు వస్తారో రమ్మను చూస్తా' అంటూ కోచింగ్ సెంటర్ యాజమాని.. మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డాడు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ సవాల్ విసిరాడు. మీలాంటి వాళ్లు వచ్చి ఇలా వ్యవహరించడం మంచి పద్దతి కాదని, రూల్స్ గురించి మాకు మస్తు తెలుసు అంటూ మాట్లాడాడు. ఇలా కోచింగ్ సెంటర్‌ను మూసివేస్తే.. కోచింగ్ సెంటర్ రూమ్ రెంట్లను ఎలా భరించాలని, మీరు కూడా నా ప్లేస్‌లో ఉండి ఆలోచించండి అంటూ మీడియా ప్రతినిధులకు చెప్పాడు. తాను ఎంత దూరమైన రావడానికి సిద్ధమని, వీడియో తీస్తే భయపడనని చెప్పుకొచ్చాడు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వైరస్ కారణంగా కేసీఆర్ సర్కార్ సోమవారం నుంచి విద్యాసంస్థలు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వం ఆదేశించినా సెలవులు ఇవ్వని స్కూళ్లపై విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. సెలవులు ఇవ్వని పాఠశాలలపై టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేసిన సైదాబాద్ వీఐపీ ఇంటర్నేషనల్ స్కూల్, చార్మినార్, బహదూర్‌పూర్ ఇంటర్నేషనల్ స్కూల్ సహ పది పాఠశాలలకు విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది.
మరీ అయిజా పట్టణంలోని వివేక్ గురుకుల కోచింగ్ సెంటర్ సెలవులు ప్రకటించినా నడుస్తోందన్న విషయం అధికారులకు తెలిసిందో లేదో.. ఇక ఈ విషయమై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.