అధికార పార్టీ ప్రజాప్రతినిధికి కరోనా..? గుంటూరులోని పలు కాలనీల్లో అలర్ట్
By Newsmeter.Network
ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజుకో కరోనా పాజిటివ్ కేసు బయటకు వస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రాకపోయినా.. వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే బావకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు సమాచారం. ఇటీవలే ఢిల్లి వెళ్లిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మార్చి 18న గుంటూరు వచ్చారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ నిర్వహించిన రోజు గుంటూరులో సుమారు 500 మందికి విందు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఆయన స్వల్ప జ్వరం, దగ్గుతో అస్వస్థతకు గురికావటంతో అనుమానాంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఇటీవల సదరు ప్రజాప్రతినిధి ఇచ్చిన విందుల్లో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే గుంటూరులో కరోనా కేసు నమోదవడంతో మంగళ దాస్ నగర్, అరుంధతి నగర్, ఆర్టీసీ కాలనీ, అంబేద్కర్ నగర్, సీతా నగర్, నెహ్రూ నగర్, వాసవి నగర్ కాలనీల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ కాలనీల్లోని ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.