హైదరాబాద్‌: ఒకే ఫ్యామిలీలో 14 మందికి కరోనా

By సుభాష్  Published on  27 May 2020 11:19 AM IST
హైదరాబాద్‌: ఒకే ఫ్యామిలీలో 14 మందికి కరోనా

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తెలంగాణలో తగ్గినట్లే తగ్గి మళ్లీ తీవ్రంగా పెరిగిపోతోంది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాకపోగా, ఒక్క హైదరాబాద్‌లో మాత్రం పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజు జీహెచ్‌ఎంసీ పరిధిలో 71 కేసులు నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతుండంతో నగర వాసులకు మరింత ఆందోళన మొదలైంది. గ్రేటర్ పరిధిలో ప్రతీ రోజు పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

ఇక తాజాగా మటన్ వ్యాపారి ఇంట్లో కుటుంబ సభ్యులందరికి ఈ కరోనా అంటుకుంది. నగరంలోని పహడీషరీఫ్‌లో నివాసం ఉంటున్న మటన్‌ వ్యాపారి ఇంట్లో 14 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మటన్‌ కొనుగోలు చేసిన వాళ్లంతా ఇప్పుడు టెన్షన్‌ పడుతున్నారు. వారంతా క్వారంటైన్‌ పాటిస్తున్నారు.

ప్రస్తుతం పహాడి షరీఫ్‌ ఏరియాను కంటైన్‌మెంట్‌ జోన్‌గా మార్చేశారు అధికారులు. ఆ మటన్‌ వ్యాపారికి జియాగూడలోని బంధువుల ద్వారా వైరస్‌ సోకినట్లు సమాచారం. దీంతో జియాగూడ ప్రాంతంలో వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్ పరిధిలోని జియాగూడ ప్రాంతాలైన ఇందిరానగర్‌, వెంకటేశ్వరనగర్‌, దుర్గానగర్‌, మక్బరా, మేకలమండి, సబ్జిమండి, సాయిదుర్గనగర్‌, సంజయ్‌నగర్‌ బస్తీల్లో కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు జియాగూడలోని అన్ని ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేశారు.

Next Story