ప్రపంచానికి ఆదర్శంగా క్యూబా..శత్రు దేశానికి డాక్టర్ల సరఫరా
By రాణి Published on 2 April 2020 3:21 PM GMT- డాక్టర్ల ఫ్యాక్టరీ క్యూబా
కరోనా..ఇప్పుడు ప్రపంచంలో 200 దేశాల్లో విస్తరించిందీ మహమ్మారి. అది కూడా పెద్ద దేశాలైన ఇటలీ, అమెరికా, ఇరాన్, స్పెయిన్ లలోనే కేసుల సంఖ్య మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరి చిన్న దేశాలు కరోనాను ఎలా జయించాయి ? వైరస్ ను ఎలా కట్టడి చేశాయి ? చిన్న దేశాలు ముందుచూపుతో తీసుకున్న జాగ్రత్తలేంటి ?
అమెరికాలో ఇప్పటి వరకూ కరోనా కేసులు 2,15,357 దాటింది. మృతుల సంఖ్య ఐదు వేలకు పైనే. ఇటలీలో కూడా మృత్యు ఘోష కొనసాగుతోంది. మరి అమెరికాకు పొరుగునే ఉన్న క్యూబా ఏం చేస్తోంది ? ఆ చిన్న దేశంలో వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకున్నారు అంటే..దశాబ్దాల క్రితం క్యూబాలో అంటువ్యాధి ప్రబలి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఏ దేశం క్యూబాకు సహాయమందించేందుకు ముందుకు రాలేదు. దాంతో గుణపాఠం నేర్చుకున్న క్యూబా..ఇకపై తమ దేశంలో ఎలాంటి వ్యాధి వచ్చినా దానిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు డాక్టర్లు అవసరమని గుర్తించింది. అంతే అప్పటి నుంచి క్యూబా డాక్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఒక రకంగా క్యూబా డాక్టర్ల ఫ్యాక్టరీ అని చెప్పాలి. ప్రతి 1000 మందికి 8.2 మంది డాక్టర్లుంటారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంతమంది డాక్టర్లుండరు.
Also Read : నిబంధనల్ని ఉల్లంఘిస్తే జైలుకే..లాక్ డౌన్ పై కేంద్రం సీరియస్
క్యూబాలో కేవలం 60 కరోనా కేసులు నమోదైతే..ఒక్కరు మాత్రమే మరణించారు. కరోనా కేసులు పెరగకుండా అక్కడి డాక్టర్లు, ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు అభినందనీయమని చెప్పాలి. ఎక్కడికక్కడ స్క్రీనింగ్ టెస్టులు చేసి, అనుమానితులను క్వారంటైన్ కు పంపారు. నిబంధనలను బేఖాతరు చేసి ఇష్టారాజ్యంగా తిరిగిన వారినుంచి భారీ జరిమానాలు వసూలు చేసింది.
దేశం చిన్నదే..మనసు పెద్దది
ఒకప్పుడు తమకు ఏ దేశం సాయం చేయలేదని మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు ప్రపంచానికి తనవంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చింది క్యూబా. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న అమెరికా, ఇటలీ దేశాలకు డాక్టర్లను పంపింది. ఈ రెండు దేశాలే కాదు..చైనాలోని వుహాన్ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో కూడా డాక్టర్లను అక్కడికి పంపింది. అలాగే అమెరికా, ఇటలీ దేశాలకు మాస్కులను అందించేందుకు స్కూల్ యూనిఫారమ్ లు కుట్టే టైలర్స్ చేత మాస్క్ లను తయారు చేయిస్తోంది. పొరుగు దేశం నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ వస్తే..వారు శత్రుదేశం నుంచి వచ్చారు కదా..మనకెందుకులే అని వదిలేయకుండా ట్రీట్మెంట్ ఇచ్చింది క్యూబా. ఏదేమైనా క్యూబా ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దేశం చిన్నదే అయినా మనసు పెద్దది.
అదేవిధంగా సార్స్ నేర్పిన పాఠాలతో సింగపూర్, తైవాన్ దేశాలు కూడా ముందే అప్రమత్తమయ్యాయి. వుహాన్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలుసుకున్నాక జాగ్రత్త చర్యలు చేపట్టాయి. చైనాలో కరోనా మృత్యుతాండవం చేస్తే..చైనాకు సమీపంలో ఉన్న తైవాన్ లో 200 కేసులు నమోదవ్వగా..ఇద్దరు మృతి చెందారు. ఇందుకు కారణం చైనాలో వైరస్ వ్యాప్తి జరుగుతున్నప్పుడు ఎయిర్ పోర్టులు, ఇతర రవాణా వ్యవస్థల్లో స్క్రీనింగ్ టెస్టులు చేసింది. ప్రతి రెండు గంటలకూ చేతులు శుభ్రం చేసుకోవాలని..దేనిని డైరెక్ట్ గా చేతులతో తాకకుండా మోచేతితో తాకడం మంచిదని సూచించింది. బయట ఏ వస్తువును ముట్టినా చేతులతో పాటు ఆ వస్తువును కూడా శానిటైజ్ చేయాలని సూచించింది.
Also Read : ఏపీలో 143కి చేరిన కరోనా కేసులు
సింగపూర్ కూడా సార్స్ నేర్పిన గుణపాఠంతో ముందే అప్రమత్తమైంది. కరోనా తొలిదశలోనే లాక్ డౌన్ చేసి..ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా చూసింది. హోమ్ క్వారంటైన్ లో ఉండేవాళ్లు విచ్చలవిడిగా తిరిగుతుంటే..వారిని గుర్తించి బయట తిరగవద్దని హెచ్చరించింది. ఇలాంటి చిన్న దేశాలు పెద్ద దేశాలకన్నా టెక్నాలజీ పరంగా కూడా ముందుంటున్నాయి. కరోనాను ఎలా అరికట్టాలో వీటిని చూసి నేర్చుకోవాలి. అంతేగానీ..ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సరైంది కాదు కదా.