ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌.. భారత్‌లోనూ విజృంభిస్తుంది. ఈ వైరస్‌ భారిన పడిన వారి సంఖ్య భారత్‌లో 500కు చేరువైంది. తొమ్మిది మంది మృతి చెందారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించింది. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఇండ్లకే పరిమితం చేస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా ఎఫెక్ట్‌ రాజ్యసభ ఎన్నికలపైనా పడింది. ఈ నెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే తదుపరి షెడ్యూల్‌ ఎప్పుడు అన్నది మాత్రం ఈసీ స్పష్టం చేయలేదు.

Also Read :రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సింది. పది రాష్ట్రాల్లో 37 సీట్లు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగిలిన 18 సీట్లకు షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 26న ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో ఈసీ ఎన్నికలను వాయిదా వేసింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు స్థానాలు ఉన్నాయి. ఏపీలో వైసీపీ తరపున మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణారావు, పారిశ్రామిక వేత్తలు అయోధ్య రామిరెడ్డి, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ సన్నిహితుడు పరిమళ్‌ నత్వాల్‌ నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు టీడీపీ నుంచి పోటీగా వర్ల రామయ్య నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు తెలంగాణలో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తెలంగాణ తరపున తెరాస నుంచి రాజ్యసభకు కేశవరావు, సురేష్‌రెడ్డిలు ఏకగ్రీవమయ్యారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.