చిరుద్యోగులపై కరోనా కోలుకోలేని దెబ్బ

By మధుసూదనరావు రామదుర్గం  Published on  5 Aug 2020 10:04 AM IST
చిరుద్యోగులపై కరోనా కోలుకోలేని దెబ్బ

పీతకష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి అంటుంటాం. కానీ కరోనా కష్టాలు అందరివీ! కరోనా వచ్చి విలవిల్లాడే వారు కొందరైతే.. కరోనా రాకున్నా దాని ప్రభావంతో దేశమంతటా విధించిన లాక్‌డౌన్‌తో ఉన్న చిన్నపాటి ఉద్యోగం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో బిక్కు బిక్కుమంటున్నవారనేకం. పరిస్థితి అధ్వానంగా ఉందని బంధువులకో, స్నేహితులకో చెబితే సాయం చేస్తారు సరే, అది ఎంతకాలం? ఏదో ఒక నెల అంటే ఫరవాలేదు. కానీ రమారమి నాలుగు నెలలు గడుస్తున్నా ఈ కరోనా ఉధృతం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రైవేటు కంపెనీలు లాభాల్లో ఉంటేనే అంతంత మాత్రం జీతాలతో సరిపెట్టేస్తాయి. అలాంటిది కష్టాల్లో ఉంటే ఇక కటింగ్‌లే కటింగ్‌లు. జీతాలు బాగున్నప్పుడు నెలనెలా బడ్జెట్‌లు తలకిందులు కావడంతో తలలు పట్టుకుంటున్నారు బడ్జెట్‌ పద్మనాభంలు. వాక్సిన్‌ వచ్చినా.. కరోనా తగ్గుముఖం పట్టినా ఈ సంక్షోభం ఇప్పట్లో తగ్గే సూచనలైతే లేవు.

బడాబడా ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తుంటే ఇక చిరుద్యోగుల మాటేంటి? పైగా వారు బ్యాంకుల్లో దాచిపెట్టుకున్నది కూడా ఉండదు. నెలనెలా ఇంటి అద్దెలు, పాలవాడికి, అంగడి సరుకులకు, మందులకు, పిల్లల చదువులకు ఎక్కడ్నుంచి తేవాలి? ‘ పంచదార లేదు.. పాలడబ్బాలేదు.. బొగ్గుల్లేవ్.. కప్పుకోడానికి రగ్గుల్లేవ్‌ ’ అని తిలక్‌ అన్నట్టు మధ్యతరగతి, దిగువమధ్యతరగతి జీవుల వెతలు వర్ణనాతీతం.

ఎంత కనాకనిష్టంగా లెక్కేసినా ఓ కుటంబానికి నగరంలో అయితే 15 నుంచి 20 వేలు, చిన్న పట్టణాల్లో అయితే రూ.15వేలు నెలనెలా ఉంటే తక్కువ అప్పులతో బైటపడొచ్చు. నగరంలో ఎంత శివారులో ఉన్నా అద్దె రూ.5వేలకు తగ్గదు. అయితే పిల్లల చదువులు, ఉద్యోగం చేసే ఆఫీసు కాస్త దగ్గరలో ఉండాలని ఆశించడం దురాశే అయితుంది. ఇంటి అద్దె, పాలవాడు, కాయగూరలు, నెలనెలా కిరాణి సరుకులు, పిల్లల ఫీజులు టీవీ కేబుల్‌ కనెక్షన్, మందులు ఉండి తీరాల్సిందేగా! ఆఫీసు, స్కూలు దూరంగా ఉంటే రవాణా ఖర్చులు అదనం. దేశంలోనే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోతున్నాం అని ఆర్థికశాస్త్రవేత్తలే తేల్చి చెబుతుంటే.. సామాన్యుల వేదన రోదన ఎవరు వింటారు? వారెలా బతికి బట్టకడతారు? ఉద్యోగం లేదని అద్దె బకాయి పెట్టినా, కిరాణా,పాలవాడి వద్ద అప్పు పెట్టినా కొండలా పేరుకుపోయిన ఆ అప్పుల్ని తీర్చాల్సిందేగా. ఈ దుస్థితిని ఎవరితో చెప్పుకోవాలన్నా మధ్యతరగతి భేషజం అడ్డుతగులుతుంటుంది.

ఇక ఆటోలు దినకూలీల పరిస్థితి చెప్పక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లున్నారు. భవనకార్మికులు, హోటల్‌లో పనిచేసేవారు, దినకూలీ కోసం అనునిత్యం అడ్డాలపై కూర్చునే వారు, చిన్న ఉద్యోగాలు చేసేవారి స్థితి ఆ భగవంతుడికే తెలియాలి. ఈ దేశాన్ని ఆదుకోడానికి సోనూసూద్‌ లాంటి దాతలు ఎంతమంది కావాలి? ప్రభుత్వం ఆర్థికసాయం అందించినా.. అది ఎక్కువశాతం బడుగు బలహీనవర్గాలకే సరిపోతుంది. మరి దేశవ్యాప్తంగా ఉన్న కొలువులూడి ఇంటికే పరిమితమైన వారి పరిస్థితి ఏంటి? నగరంలో ఓ చిరుద్యోగి తన ఉద్యోగం కోల్పోయి ప్రస్తుతం తన అర్చకవృత్తిని చేపట్టడానికి పూజాది విధానాలను నేర్చుకుంటున్నాడు. వృత్తి విద్యలు, నైపుణ్యాలున్న వారు సరే...కేవలం ఉద్యోగాలపైనే బతికేవారి పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా అసంఘటిత రంగాలకు చెందిన కార్మికుల ఉద్యోగుల బతుకులు ఆగమాగమం అయిపోతున్నాయి.

లాక్‌డౌన్‌ ఎత్తేశాక కొన్ని కంపెనీలు, అంగళ్ళు తదితరాలు కొనసాగుతున్నా అందరికీ ఉపాధి ఇచ్చే పరిస్థితిలేదు. హోటళ్ళు బంద్‌ అయి కుక్‌మాస్టార్లు, బేరర్లు, సర్వర్లు ఇంట్లో ఉండిపోతున్నారు. పెళ్ళి చాలా పెద్ద బిజినెస్‌ ఎందరికో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. కానీ అవీ జరగడం లేదు. అన్నీ లిమిటెడ్‌ అయిపోయాయి. 50 మంది కూడా లేని పెళ్ళి ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది. కల్యాణమంటపం, డెకోరేషన్, క్యాటరింగ్, సప్లయర్స్, అందరికీ ఈ శ్రావణమాసం మంచి గిరాకీ ఉండేది. చాలా బిజీగా ఉండేవారు. కరోనా దెబ్బకి అందరు దుకాణాలు బంద్‌ చేసుకున్నారు.

ఉపాధి కోల్పోయిన కుటుంబాలను సర్కారే ఆదుకోవాలి. కొలువులు లేని వారికి ఏదో ఒక ఉపాధి చూపించాలి. సర్కారు పేదలకు బియ్యం నగదు అందిస్తున్నా అవసరమున్న అందరికీ అందడంలేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సర్కారు, దాతల సాయం కంటే.. కరోనా కరుణించి తనను తాను తగ్గించుకుని సాయమందించాలి. అయితే ఈ పరిస్థితి రానున్న కాలంలో ఉండదు. ఈ చీకట్లు తొలిగి వెలుగు రావడం ఖాయం. కానీ అంతవరకు ఈ చీకటి కష్టాలను అధిగమించేది ఎట్లా అనేదే సగటు పేదల ప్రశ్న!!

Next Story