కరోనా ఎఫెక్ట్: మార్చి నెలాఖరు వరకు పాఠశాలలు, సినిమా థియేటర్లు బంద్
By సుభాష్
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా ప్రభావం చాలా రంగాలపై పడుతోంది. ముందుగా చైనాలో పుట్టిన ఈ వైరస్ అన్నిదేశాలకు పాకింది. కరోనా భయంతో కేరళలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యవసరమైన చర్యలు చేపట్టేందుకు కేబినెట్ సమావేశాన్నిఏర్పాటు చేసింది. కోవిడ్-19 వ్యాపించకుండా అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేటి నుంచి మార్చి ఆఖరు వరకు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అనంతరం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఏడో తరగతి పైబడిన విద్యార్థులకు ముందుగా నిర్ణయిచిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈనెల మొత్తం ప్రభుత్వపరమైన వేడుకలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సినిమా థియేటర్లు, డ్రామా కంపెనీలు ఈనెలాఖరు వరకు తెరవవద్దని ఆదేశాలు జారీ చేశారు. వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. వైరస్ గురించి ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దని సూచించారు.
ప్రజలంతా బాధ్యతతో వ్యవహరిస్తే వైరస్‌ను ఎదుర్కొవచ్చు
ప్రజలంతా బాధ్యతతో వ్యవహరిస్తే కరోనా వైరస్‌ను సులభంగా ఎదుర్కొవచ్చని సీఎం విజయన్ అన్నారు. కేరళలో నెల క్రితం కరోనా కేసులు నమోదు కాగా, సత్వర వైద్య చికిత్సలు అందించడంతో వారు త్వరగా కోలుకున్నారని గుర్తు చేశారు. తాజాగా వైరస్ బారిన పడినవారు కూడా కోలుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, కేరళలో ఇప్పటి వరకు 1116 మంది కరోనా అనుమానితులు వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.