అమెరికాలో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త
By సుభాష్ Published on 14 April 2020 12:50 PM GMTకరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా వణికిపోతోంది. అమెరికాలో సైతం కరోనా కాలరాస్తోంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌ను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇక కరోనా వల్ల అమెరికాలో చిక్కుకున్న భారతీయులకు తీపి కబురు చెప్పింది. వీసా పొడిగింపుపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని అగ్రరాజ్యం హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ సందర్భంగా తన వెబ్ సైట్‌లో ఒక నోటిఫికేషన్‌ను పోస్టు చేసింది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వీసాల గడువు పొడిగింపుపై పరిశీలిస్తామని తెలిపింది. ప్రతీ దరఖాస్తులు పరిశీలించి అమలయ్యే విధంగా చూస్తామని తెలిపింది. ఈ నిర్ణయంతో అమెరికాలో ఉన్న భారతీయులకు ప్రయోజనం కలుగనుంది.
వీసాల గడువు ముగిసి అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులకు ఈ నిర్ణయంతో ఊరట లభించనున్నట్లు సంబంధిత అధికారి పేర్కొన్నారు. అయితే కరోనా నేపథ్యంలో హెచ్-1బీ సహా, వివిధ రకాల వీసాలను చెల్లుబాటు అయ్యేలా పొడిగించాలని గతవారం అమెరికాను భారత ప్రభుత్వం కోరడంతో ఈ ప్రకటన వెలువడింది. హెచ్-1బీ వీసాదారులు ఒక వేళ ఉద్యోగాలు కోల్పోయినట్లయితే అగ్రరాజ్యంలో ఉండే గడువును 60 రోజుల నుంచి 8 నెలల వరకు పొడిగించినట్లు పేర్కొంది.