కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ అన్ని రంగాలపై పడుతోంది. చైనాలో మొదలైన ఈ వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కరోనా ఎఫెక్ట్‌ ఇప్పుడు టాలీవుడ్‌పై పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వెళ్లి సినిమా చూసే అవకాశం లేదనే భయం టాలీవుడ్‌ను వెంటాడుతోంది. కరోనా కారణంగా టాలీవుడ్‌ నష్టపోకుండా ఉండేందుకు టాలీవుడ్‌ పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఒక కరోనా కేసు నమోదు కావడంతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో కొంత కాలం పాటు సినిమాల విడుదలను వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే తామే ఓ నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సహకరించాలనే ఆలోచనలో టాలీవుడ్‌ ఇండస్ట్రీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సినీ ఇండస్ట్రీ పెద్దలు గురువారం సాయంత్రం అత్యవసర సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కొన్ని రోజులపాటు థియేటర్లను మూసివేతకు సంబంధిత అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద కరోనా ఎఫెక్ట్‌ టాలీవుడ్‌పై కూడా చూపుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో కరోనా సోకిన వ్యక్తి సికింద్రాబాద్‌కంటోన్మెంట్‌ పరిధిలోని మహేంద్రాహిల్స్‌ కు చెందిన వ్యక్తి కావడంతో ఆ ప్రాంతంలోని అన్ని పాఠశాలలు తాత్కాలికంగా మూసివేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసులో అధికంగా నమోదైతే దీని ప్రభావం వివిధ రంగాలపై పడే అవకాశం ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.