మ‌హ‌మ్మారికి ఇక చెక్‌ ​: కరోనాకు భారత్​లో డ్రగ్ రిలీజ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jun 2020 12:26 PM GMT
మ‌హ‌మ్మారికి ఇక చెక్‌ ​: కరోనాకు భారత్​లో డ్రగ్ రిలీజ్

కరోనా రోగుల చికిత్స కోసం ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ సంస్థ గ్లెన్​మార్క్​ ప్రకటించింది. యాంటీవైరల్​ డ్రగ్​ ఫావిపిరవిన్‌ను ఫాబిఫ్లూ పేరుతో తీసుకొచ్చినట్లు తెలిపింది.

ప్రాణాంతక కరోనా వైరస్​కు ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ ఫార్మా సంస్థ గ్లెన్​మార్క్​ ప్రకటించింది. ఫాబిఫ్లూ పేరుతో యాంటీవైరల్​ డ్రగ్​ ఫావిపిరవిర్​ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ మందును స్వల్ప నుంచి మధ్యస్థాయి లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగుల చికిత్సకు ఉపయోగించవచ్చని పేర్కొంది.

ముంబయికి చెందిన ఈ సంస్థ ఫాబిఫ్లూ తయారీ, మార్కెటింగ్​కు డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి శుక్రవారం అనుమతులు పొందింది. కరోనాకు చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే ఔషధాల్లో ఆమోదం లభించిన మొదటి డ్రగ్​ ఫాబిఫ్లూనేనని సంస్థ పేర్కొంది.

"దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మన ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. సరైన సమయంలో ఔషధానికి ఆమోదం లభించింది. ఈ ఔషధంతో సమర్థమైన చికిత్స అందించవచ్చు. ఫలితంగా ఈ ఒత్తిడిని తగ్గించవచ్చని గ్లెన్​మార్క్​ ఛైర్మన్​, ఎండీ గ్లెన్​ సల్దానా పేర్కొన్నారు.

అయితే.. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగానే ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్టు తెలిపారు. అలాగే, ఒక్కో మాత్ర ధర రూ.103గా ఉంటుందని వెల్లడించారు. కరోనా బారిన పడినవారు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను తొలి రోజు రెండు సార్లు వేసుకోవాలనీ.. ఆ తర్వాత వరుసగా 14 రోజుల పాటు 800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను రోజుకు రెండుసార్లు చొప్పున వాడాలని సూచించారు.

ఇదిలావుంటే.. భార‌త్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో కొత్త‌గా 14,516 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,048కి చేరింది. నిన్న ఒక్క‌రోజే 375 మంది కోవిడ్-19 కార‌ణంగా చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 12,948 కి చేరింది.

Next Story
Share it