2లక్షలు దాటిన కరోనా మరణాలు.. బ్రెజిల్‌లో పరిస్థితి దయనీయం
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారీన పడి ప్రపంచ వ్యాప్తంగా 2లక్షలకు పైగా మంది మరణించారు. బాధితుల సంఖ్య 29 లక్షలకు చేరువైంది. కాగా.. మొత్తం కేసుల్లో మూడో వంతు మరణాల్లో నాలుగో వంతు ఒక్క అమెరికాలోనే చోటు చేసుకున్నాయి. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 9 లక్షలు దాటితే.. మృతుల సంఖ్య 52వేలు దాటేసింది. ఇక యూరప్ లక్షా 20వేలకు పైగా మరణాలతో మొదటి స్థానంలో ఉంది. ఇటలీ స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు.
బ్రెజిల్ లో చేతులెత్తేసిన ఆస్పత్రులు..
లాటిన్ అమెరికాలో అతి పెద్దదేశమైన బ్రెజిల్‌లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. కొత్త కేసులను చేర్చుకోలేమని పలు హాస్నిటల్స్ చేతులెత్తేశాయి. దీంతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ 52,995 కరోనా పాజిటివ్ కేసులు నమోదే కాగా.. 3600 మంది మరణించారు. దేశంలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నా కూడా.. ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వాటిని సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. సామాజిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, బ్రెజిలియన్లలో అధిక ప్రమాదం ఉన్న వారిని మాత్రమే ఐసోలేట్ చేయాలని ఆయన సూచించారు. దీంతో అక్కడ ఎంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక అమెజాన్ రాష్ట్రంలోని మానాస్ నగరంలో.. ఒక శ్మశాన వాటికలో పెద్ద ఎత్తున గోతులు తవ్వి సామూహిక ఖననాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికాలో ఆంక్షల సడలింపు..
ఆరోగ్యం, ఆర్థికం ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తూ ప్రపంచ దేశాలు ఆంక్షల్ని సడలిస్తున్నాయి. తమ దేశంలో సాధారణ కార్యకలాపాలను త్వరలోనే పునః ప్రారంభిస్తామని, ఇదెంతో ఉద్వేగం కలిగిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతవారంతో పోలిస్తే.. కొత్త కేసులు 38 శాతం నుంచి 28 శాతానికి తగ్గాయన్నారు. ఇక అగ్రరాజ్యంలో కోవిడ్ స్వైరవిహారం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆంక్షల్ని ఎత్తివేయడం సరికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే వీలైనంత త్వరగా అందరూ పనుల్లోకి రావాలని ట్రంప్ సర్కార్ అంటోంది.