భారత్ ను కలవరపెడుతున్న డెత్ రేట్

By సుభాష్  Published on  30 March 2020 11:59 AM IST
భారత్ ను కలవరపెడుతున్న డెత్ రేట్

కరోనా మహమ్మారి మీద భారత్ పోరాడుతోంది. జనాభా పరంగా భారత్ మిగిలిన దేశాల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య తక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను ఏర్పాటు చేయడం.. ఇతర దేశాల నుండి ఎవరినీ రాకుండా చేయడంతో భారత్ లో కరోనా వైరస్ లక్షణాలు చాలా తక్కువ మందిలో మాత్రమే బయటపడ్డాయి. మరికొందరు అనుమానితులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు హోమ్ క్వారెంటైన్ లో ఉంచాయి.

కానీ ఒక్క విషయం భారత్ ను కాస్త కలవరపెడుతూ ఉంది. భారత్ లో 1024 కేసులు నమోదవ్వగా అందులో 2.6 శాతం మంది మరణించారు. ఇక రికవరీ 9.3 శాతం మాత్రమే..! ఇక అగ్రరాజ్యం అమెరికాలో 142356 కేసులు నమోదవ్వగా చనిపోయిన వారి శాతం 1.74 మాత్రమే.. ఇక అమెరికాలోని కరోనా బాధితుల్లో రికవరీ శాతం చాలా తక్కువ ఉంది. ప్రపంచ పెద్దన్నను ముఖ్యంగా కలవరపెడుతూ ఉన్న అంశం ఇదే.. అమెరికాలో వైరస్ సోకిన వారిలో రికవరీ కేవలం 3.3 శాతం మాత్రమే ఉంది.

ఇటలీలో చనిపోతున్న వారి శాతం అక్కడి ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి. 97689 కేసుల్లో 11శాతం మంది మరణించారు. రికవరీ అవుతున్న వారి శాతం 13.3 ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక ప్రాంతాలు ఉన్న ఇటలీ.. కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైపోయింది.

జర్మనీ ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి చాలానే కష్టాలు పడుతోంది. ఆ దేశంలో 62095 కేసులు నమోదవ్వగా.. చనిపోతున్న వారి శాతం 0.87... ఇక రికవరీ అవుతున్న వారి శాతం కూడా మిగిలిన దేశాలతో పోలిస్తే అధికంగా ఉంది. జర్మనీ లోని కరోనా వైరస్ బాధితుల్లో 14.8 శాతం రికవరీ అయ్యారు. కరోనా వైరస్ ప్రబలడం విషయంలో ఒక్కో దేశం.. ఒక్కో స్టేజ్ లో ఉంది.

కోవిద్-19 కేసులు గత 6 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. మార్చి 29, సాయంత్రం 7:30 సమయంలో భారత్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1000 మార్కును తాకింది. 1024 మందిలో 27 మంది చనిపోయారు.. అది 2.6 శాతంగా చెప్పుకోవచ్చు. 9.3 శాతం అంటే 96 మంది రికవరీ అయ్యారు.

డెత్ రేట్ అన్నది భారత ప్రభుత్వాన్ని, అధికారులను విపరీతంగా కలవరపెడుతోంది. వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున.. డెత్ రేట్ ఇలాగే ఉంటే చాలా కష్టం. ముఖ్యంగా వైరస్ ప్రబలకుండా చేయాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున తమ పనిని చేసుకుంటూ వెళుతున్నాయి. కానీ ప్రజల్లోనే చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతూ.. సామాజిక దూరం కనీసం పాటించకుండా ఉంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రమ్మని కోరుతుంటే.. కొందరు మాత్రం పెడచెవిన పెడుతూ ఉన్నారు. అలాంటి వారికి పోలీసులు కూడా తగిన శిక్షను విధిస్తూ ఉన్నారు.

భారత దేశంలో ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ విధించారు. కానీ కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఢిల్లీ-యూపీ బోర్డర్ లో వేలమంది ఊళ్లకు వెళ్ళడానికి ప్రయత్నించారు. ఒక్కరు కూడా సామాజిక దూరం అన్నది పాటించకుండా.. గుంపులు గుంపులుగా నిలబడ్డారు. వేరే రాష్ట్రాల్లో ఆకలి చావులకు భయపడే వారందరూ సొంత ఊళ్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒక్కసారిగా బోర్డర్ కు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం అన్నది నెలకొంది.

Next Story