ఈ జబ్బులున్న వారికి మహమ్మారి సోకితే మహా డేంజర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jun 2020 8:28 AM GMT
ఈ జబ్బులున్న వారికి మహమ్మారి సోకితే మహా డేంజర్

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారికి సంబంధించిన కొత్త విషయం తాజాగా చేపట్టిన ఒక అధ్యయనం వెల్లడించింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. దీనికి సంబంధించిన నివేదికను ప్రఖ్యాత లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మ్యాగజైన్ పబ్లిష్ చేసింది. ఇందులో పేర్కొన్న పలు అంశాలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ప్రపంచ జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరికి మాయదారి జబ్బు ముప్పు ఉందని తేల్చారు. ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల మందికి వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉందని లెక్క కట్టారు. ప్రపంచ జనాభాలో 22 శాతం మందికి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధ పడుతుంటారని.. అలాంటి వారికి మాయదారి రోగానికి గురైతే.. అది మరింత ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు.

ముఖ్యంగా కొన్ని రకాల జబ్బులు ఉన్న వారు.. మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. టైప్ 2 డయాబెటిస్.. గుండె.. కిడ్నీ.. ఊపిరితిత్తుల జబ్బులు.. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి వైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటివారికి వైరస్ సోకితే వారు తీవ్ర ముప్పును ఎదుర్కొంటారని తాజా సర్వేలో వెల్లడైంది.

అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న వారిలో 20 ఏళ్ల లోపు ఉన్న వారు తక్కువగా ఉన్నారని తేల్చారు. వీరు కేవలం ఐదు శాతమే ఉన్నారని సర్వే చెప్పింది. అదే సమయంలో 70 ఏళ్లకు పైబడిన వారికి ఈ ముప్పు 66 శాతం ఉన్నట్లు తేల్చారు. వీరిలో ఆరు శాతం పురుషులకు.. మూడు శాతం మహిళలకు ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. సో.. మాయదారి రోగం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Next Story