వచ్చే ఫిబ్రవరి నాటికి కరోనా నియంత్రణలోకి వస్తుంది.. ప్రత్యేక కమిటీ వెల్లడి
By సుభాష్
దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. భారత్‌లో కరోనా వైరస్ గరిష్ఠస్థాయిని దాటేసిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనా పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని కేంద్రం నియమించిన కమిటీ తెలిపింది. ఇక లాక్‌డౌన్‌లు అవసరం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రస్తుతం పాటిస్తున్న కోవిడ్ నిబంధనలను కొనసాగించాలని, లేకపోతే వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత్‌లో సరైన సమయంలో లాక్‌డౌన్ విధించడం వల్ల కరోనా మహమ్మారిని ఎదుర్కొందని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
దేశంలో కరోనా తీవ్రత, లాక్‌డౌన్, వలస కార్మికుల ప్రభావం, వైరస్ ప్రభావం లాంటి రకరకాల అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదికను తయారు చేసింది. ఈ కమిటీలో శాస్త్రవేత్తలతో పాటు ఐఐటీ, ఐఐఎస్‌సీలకు చెందిన ప్రొఫెసర్లు ఉన్నారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టినా.. జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలని, వచ్చే చలికాలం, పండగల సమయాల్లో కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ప్రజలు ఎవరికి వారు ఇప్పుడున్నట్లుగానే మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని, కోవిడ్ నిబంధనలు పాటిస్తే ఫిబ్రవరి నాటికి నియంత్రణలోకి వస్తుందని కమిటీ తెలిపింది.
లాక్‌డౌన్‌తో ఎంతో మేలు
కరోనా విరుచుకుపడుతున్న సమయంలో లాక్‌డౌన్ విధించడంతో ఎంతో మేలు జరిగిందని, ఇకపోతే ఈ పాటికి కేసులు, మరణాల సంఖ్య తీవ్రంగా ఉండేదని కమిటీ అభిప్రాయపడింది. అలాగే కరోనా సమయంలో వలసలు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై పెద్దగా ప్రభావం చూపలేదని కమిటీ విశ్లేషించింది. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, కోవిడ్ నిబంధనలు పాటించడం వంటివి పరిశీలిస్తే ఇతర దేశాల కంటే మన దేశం ఎంతో మేలని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా మరణాలను పరిశీలిస్తే మన దేశంలో మరణాల రేటు 2 శాతమేనని, ఇది ప్రపంచంలోనే అత్యల్పమని నివేదిక ప్రకటించింది.