దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇక అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రంలో నమోదవుతున్నాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు కరోనా సోకి, 18 మంది వరకూ మృతి చెందారు. ముంబైలోని విలే పార్లే పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అరుణ్‌ ఫడ్టారే కరోనా బారిన మరణించినట్లు ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌సింగ్‌ తెలిపారు.

వయసు పైబడటంతో గత కొన్ని రోజులుగా సెలవులో ఉన్న ఆయన శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు. మే 21న కరోనా కారణంగా ఎఎస్‌ఐ బివ్‌సేవ్‌ హరిభావును కోల్పోయామన్నారు. వరుసగా పోలీసులు వైరస్‌ బారిన పడి మృతి చెందడం పట్ల రాష్ట్ర డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కరోనా సోకి మృతి చెందడం, వయసు పైబడిన వారిని విధుల్లోకిరాకుండా సెలవుల్లో ఉండాలని సూచించడంతో విధులు నిర్వహించేందుకు పోలీసుల సంఖ్య కూడా తగ్గిపోయిందన్నారు.

దీంతో అధిక సంఖ్యలో మహారాష్ట్రలో పోలీసులు మృతి చెందడం మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ కరోనా నేపథ్యంలో మహరాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత అవసరాలకనుగుణంగా సాయుధ పోలీసు బలగాల నుంచి సుమారు 2వేల వరకూ అదనపు పోలీసులను పంపించాలని కేంద్రాన్ని కోరింది. భారత్‌లోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రస్థాయిలో ఉండటంతో ఇప్పటి వరకూ 44,582 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 1517 మంది మరణించారు. శుక్రవారం ఒక రోజే 63 మంది వరకూ మృత్యువాత పడ్డారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *