మాకు గన్‌మెన్‌లను తీసేయ్యండి.. మహిళలకు గన్ లైసెన్స్‌లు ఇవ్వండి..!
By న్యూస్‌మీటర్ తెలుగు
రాష్ట్ర విభజన కాకముందు, అయిన తరువాత ఆడపిల్లలపై అత్యాచారం చేసి చంపిన సంఘటనలు చాలా జరిగాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అయితే.. ప్రభుత్వ, పోలీసుల దృష్టికి వచ్చిన కొన్ని సంఘటనలు మాత్రమే హైలెట్ అయ్యాయని ఆయన అన్నారు. వీటిలో కొన్ని సంఘటనలకు మాత్రమే ఎందుకు పోలీసులు స్పందించారని.. ఎందుకంటే ప్రజల నుండి వ్యతిరేకత రావడం వల్లనే స్పందించారని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల ఆకాంక్షల మేరకే పని చేయాలన్నారు.
శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్టుగా అనేక ఆరోపణలున్న నిత్యానందను కూడా ఎన్‌కౌంటర్ చేస్తారా? అని ప్రశ్నించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ విషయమై ప్రస్తావించిన ఆయన నిత్యానందపై వ్యాఖ్యలు చేశారు. ఓ ఆడపిల్ల తండ్రిగా ఎన్‌కౌంటర్‌ని సమర్థిస్తున్నానన్నా ఆయన.. చట్ట పరిధిలో న్యాయం చేయాల్సిందని ఎమ్మెల్యేగా అభిప్రాయం వ్యక్తం చేశారు.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ద్వారా మానభంగాలు జరగవని చెప్పగలరా? అని పోలీసులు, ప్రభుత్వాన్ని జగ్గారెడ్డి ప్రశ్నించారు. మహిళల రక్షణ కోసం జిల్లాల్లో కంట్రోల్‌రూమ్‌లు పెట్టాలని.. ఎమ్మెల్యేలకు గన్‌మెన్‌లను తీసివేసి.. మహిళలకు గన్ లైసెన్స్‌లు ఇవ్వడం బెటరని ఆయన అన్నారు.