కర్ణాటక ఫార్ములా: శివసేనకు మద్దతిచ్చేందకు కాంగ్రెస్ రెడీ...!
By న్యూస్‌మీటర్ తెలుగు
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. సీఎం సీటుపై ఆశ పెట్టుకున్న శివసేనకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ కూటమి రెడీ అయింది. రంగంలోకి కాంగ్రెస్ పెద్దలు దిగుతున్నట్లు సమాచారం. మహారాష్ట్రంలో ఒక పక్క ఫలితాలు వస్తుండగానే మరోపక్క సోనియా మార్క్ రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలను అధిష్టానం అలర్ట్ చేసింది. మరోవైపు...అధిష్టానం దూతలు సాయంత్రానికి ముంబై చేరుకునే అవకాశముంది. హర్యానాలో బీజేపీకి అధికారం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే...కాంగ్రెస్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి అమిత్ షా రంగంలోకి దిగారు.
మహారాష్ట్రలో అనుకున్నంత పెద్ద విజయం బీజేపీ కూటమికి రాలేదు. ఎన్నికల ప్రచారంలో 200 సీట్లు వస్తాయని కమలనాధులు గట్టిగా చెప్పారు. కాని..ఈవీఎంల్లో ఓటరు మరో రకంగా ఓటు వేశాడు. బీజేపీ - శివసేన కూటమి మ్యాజిక్ మార్క్ దాటినప్పటికీ...సీఎం సీటు విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశముంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ముందుగానే అంచనా వేసింది. ఇద్దరి మధ్య లుకలుకలను వాడుకోవడానికి రంగంలోకి దిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి 100కు అటుఇటుగా సీట్లు వచ్చే అవకాశముంది. దీంతో 60కి పైగా సీట్లు గెల్చుకోబోతున్న శివసేనకు గాలం వేస్తుంది. శివసేన సీఎం అభ్యర్దికి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, శివసేన రెడీ అవుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన కమలనాధుల అలర్ట్ అయ్యారు. అతి పెద్ద పార్టీ తమదే కనుక తమనే ముందుగా పిలవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఇంకా..శివసేన నోరు మెదపలేదు. కాంగ్రెస్ వేయబోతున్న గాలానికి శివసేన దొరుకుతుందా? సిద్దాంతాలకు కట్టుబడి బీజేపీతోనే ఉంటుందా అనేది చూడాలి. మొత్తానికి బీజేపీ , శివసేన మహారాష్ట్ర సీఎం సీటును పంచుకుంటాయా..లేకపోతే అమిత్ షా చాణక్యంతో మళ్లీ ఫడ్నీవీసే సీఎం అవుతారా అనేది చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!