ఇంట్లో బొద్దింక కనపడితే అసహ్యించుకుంటాం. దానిని ఎలాగో ఒకలాగా వదిలించుకుంటాం. అదే విమానంలో అయితే అక్కడ హిట్టు, పేపరు దొరకవు కాబట్టి సిబ్బందికి ఫిర్యాదు చేస్తాము. అయితే అలా ప్రయాణికులు చేసిన ఫిర్యాదును సిబ్బంది పెడచెవిన పెట్టిన ఫలితం ఇండిగో విమాన సంస్థకు రూ.50 వేలు జరిమానా పడింది. రెండేళ్ల క్రితం అసీమ్, సురభి భరద్వాజ్ అనే ప్రయాణికులు ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి పూణే వెళ్లారు. అయితే వారు తమ సీటు కింద ఓ బొద్దింక ఉన్న విషయాన్ని గుర్తించి విమాన సిబ్బందికి తెలియజేశారు. కానీ, విమాన సిబ్బంది ఆ విషయానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆ ప్రయాణికులిద్దరూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నా గానీ సిబ్బందిలో చలనంలేదు. పైగా, చేసుకోండి ఫిర్యాదు అంటూ మరింత నిర్లక్ష్యం ప్రదర్శించారు.

దీంతో విమానం దిగిన తర్వాత బాధితులు ఇండిగో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బొద్దింక ఉన్న ఫొటోను కూడా సంస్థ అధికారులకు చూపించారు. వారూ సరిగా రెస్పాండ్ కాలేదు. దీంతో ప్రయాణికులు పుణె జిల్లా వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణ జరిపిన న్యాయస్థానం ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఇండిగోను ఆదేశించింది. ప్రయాణికులకు టికెట్‌ ఛార్జీలను తొమ్మిది శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని తీర్పు చెప్పింది. అటు నష్టపరిహారంగా 50 వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది. మొత్తానికి ఫ్లైట్ ఎక్కిన బొద్దింక విదేశాలకు వెళ్లిందో లేదో తెలియదు కానీ చూసినవాళ్లకు మాత్రం డబ్బులు తెచ్చిపెట్టింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.