అమిత్ షా చెవిలో వైఎస్ జగన్ ఏం చెప్పారు..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2019 1:00 PM ISTఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఇద్దరూ 45 నిమిషాల పాటు చర్చించుకున్నట్లు సమాచారం. ప్రత్యేక హోదా, రెవిన్యూలోటు కింద రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలో హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్, శ్రీశైలంలకు గోదావరి వరదజలాల తరలింపుపై అమిత్‌షాతో సీఎం జగన్ చర్చించినట్లు సమాచారం.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు మరోసారి విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. పరిశ్రమలు, సేవారంగాలపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. వీటి వాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందని కేంద్ర హోంమంత్రి దృష్టికి సీఎకం జగన్ తీసుకెళ్లారు.ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమన్నారు. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు కాకుండా పరిశ్రమలు ఏపీ వైపు చూడాలంటే ప్రత్యేక తరగతి హోదా తప్పనిసరి అని అమిత్ షాతో సీఎం జగన్ అన్నట్లు తెలుస్తోంది.
రెవిన్యూలోటు కింద నిధులు ఇవ్వండి
2014-2015లో రెవిన్యూలోటును కాగ్‌తో సంప్రదించి సవరిస్తామని గతంలో అమిత్ షా ఇచ్చిన హామీని జగన్ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.22,948.76 కోట్లు రెవిన్యూ లోటు ఉంటే..ఇంకా రూ.18,969.26 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను ఆదేశించాలని అమిత్ షాకు జగన్ విజ్ఞప్తి చేశారు.
కడప స్టీల్ ప్లాంట్ కు సహాయం చేయండి
కడపలో స్టీల్ ప్లాంట్ కూడా అమిత్ షాతో భేటీ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణం, విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులను సమకూర్చాల్సిందిగా అమిత్ షాకు జగన్ విజ్ఞప్తి చేశారు.
వెనకబడ్డ జిల్లాల నిధులు పెంచండి
వెనకబడ్డ జిల్లాలకు ఇచ్చే నిధుల క్రైటియారియాను మార్చాలని అమిత్ షాను జగన్ కోరారు. ఏపీలో వెనకబడ్డ జిల్లాల్లో తలసరి రూ.400 రూపాయలు ఇస్తే, బుందేల్‌ఖండ్, కలహండి ప్రాంతాలకు తలసరి రూ.4000ఇస్తున్నారని చెప్పారు. ఇదే తరహాలో ఏపీలోని వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో వెనకబడ్డ 7 జిల్లాలకు ఏడాదికి రూ. కోట్లు చొప్పున ఇప్పటివరకూ రూ.2,100కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకూ రూ.1050 కోట్లుమాత్రమే ఇచ్చారని, మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదలచేయాలన్న సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
రివర్స్ టెండరింగ్ తో ప్రజాధనాన్ని కాపాడాం
పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,548.87 కోట్లకు ఆమోదించాలని అమిత్ షాను జగన్ కోరారు.
ఇందులో రూ.33వేలకోట్లు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్‌కే ఖర్చు అవుతుందని జగన్ తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.5,073 కోట్లను వెంటనే విడుదలచేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.16వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు జగన్. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియద్వారా రూ.838 కోట్ల ప్రజాధానాన్ని ఆదాచేశామని అమిత్‌షాకు తెలిపారు. హెడ్ వర్క్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో రూ.780 కోట్లు, టన్నెల్ పనుల్లో రూ.58 కోట్లు ఆదా అయ్యాయని అమిత్ షాకు జగన్ చెప్పారు.
గోదావరి జలాలను కృష్ణకు తరలిస్తాం
ఇక ..నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి జలాలు తరలింపు విషయంపై కూడా అమిత్ షా, జగన్ లుచర్చించినట్లు తెలుస్తోంది.కృష్ణానదిలో గడచిన 52 సంవత్సరాల్లో నీటి లభ్యత సగటున ఏడాదికి 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయిందన్నారు జగన్. మరోవైపు గోదావరిలో గడచిన 30 సంవత్సరాలుగా సగటున ఏడాదికి 2,780 టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయన్నారు. గోదావరి జలాలు కృష్ణకు తరలిస్తే రాయలసీమతోపాటు, మరికొన్ని ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని అమిత్ షాతో జగన్ అన్నట్లు తెలుస్తోంది.
ఏపీ రాజకీయాలపై అమిత్ షా, సీఎం జగన్ చర్చ
ఏపీ రాజకీయాల గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే..ఏంమాట్లాడుకున్నారనే వివరాలు గోప్యంగా ఉంచారు. సీఎం వైఎస్ జగన్ వెంట వైఎస్ఆర్ సీపీకి సంబంధించిన పలువురు ఎంపీలు, నేతలు ఉన్నారు.
అమిత్ షా, వైఎస్ జగన్ పిక్స్
అపాయింట్ మెంట్స్ రద్దు చేసుకున్న సీఎం జగన్
ఢిల్లీలో కేంద్రమంత్రుల అపాయింట్మెంట్స్ ఏపీ సీఎం వైఎస్ జగన్ రద్దు చేసుకున్నారు. ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని విశాఖపట్నం బయల్దేరనున్నారు. విశాఖపట్నంలో ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్‌కు హాజరు కానున్నారు.