గిరిజనుల రుణం తీర్చుకుంటున్న జగన్!
By సుభాష్ Published on 9 Sept 2020 10:18 AM ISTఏ ప్రభుత్వమైనా.. ప్రజలకు ఏదైనా చేసిందంటే.. దానివెనుక ఖచ్చితంగా రాజకీయ ప్రయోజన కోణం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయంలో గతంలో చంద్రబాబు అయినా.. ఇప్పుడు సీఎం జగన్ అయినా.. ఒక్కటే వ్యూహం. మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకోవడమే. అయితే, ఈ విషయంలో చంద్రబాబు చేసినదానికన్నా కూడా ప్రచారం చేసుకున్నదే ఎక్కువ. కానీ, జగన్ విషయంలో చేస్తున్నది ఎక్కువే ఉన్నప్పటికీ.. ప్రచారం మాత్రం తక్కువగానే ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ.. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆశించే అంతిమ లక్ష్యం ఓటు బ్యాంకే!
తాజాగా సీఎం జగన్.. కీలకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది కూడా అక్టోబరు రెండున గాంధీ జయంతి నాడు ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. అదే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు పట్టాల పంపిణీ. నిజానికి ఇది చాలా సాహసోపేతమైన కార్యక్రమమనే చెప్పాలి. గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఎవరూ ఈ కార్యక్రమం జోలికి వెళ్లలేదని అధికారులు సైతం చెబుతున్నారు. ఇది అటవీ హక్కుల చట్టాలను అనుసరించి అమలు చేయాల్సిన కార్యక్రమం కావడంతోపాటు.. రాష్ట్రంలో స్వల్పంగా ఉన్న గిరిజనులకు చేసే మేలు వల్ల ఒనగూరే ప్రయోజనం కూడా తక్కువగానే ఉంటుందనే అంచనాతోను గత పాలకులు ఈ కార్యక్రమాలను పట్టించుకోలేదు.
కానీ, ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం అత్యంత కీలకమైన ఈ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 35 షెడ్యూల్డ్ మండలాల్లో ఆర్‌వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. స్థలాలకు సరిహద్దులు నిర్ణయించాలని, లబ్ధిదారులతో ఫొటోలు తీయాలని, సదరు రికార్డులను ఆన్‌లైన్ చేయాలని కూడా జగన్ సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దీంతో నిజంగానే గిరిజనులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న కీలక క్రతువుకు జగన్ పరిష్కారం చూపించనట్టు అవుతుంది. ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకునేందుకు కూడా మరింత అవకాశం ఏర్పడుతుంది.
2014, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని దాదాపు అన్ని గిరిజన అసెంబ్లీ(2014లో పోలవరం తప్ప), పార్లమెంటు స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం మరింత మేలు చేస్తుందనే విశ్లేషణలు వస్తున్నాయి. అంతేకాదు, తన పార్టీకి ఓటేసిన గిరిజనుల రుణం తీర్చుకున్నారనే పేరు కూడా జగన్‌కు చిరస్థాయి కానుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. ఎస్టీ వర్గాలకు మేలు చేసే ఈ కార్యక్రమం రాజకీయంగా కూడా ప్రభావం చూపనుందనేది వాస్తవం.